Viral Wedding: నేటి కాలంలో సరైన సమయంలో పెళ్లిళ్లు జరగక చాలామంది యువకులు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. కొందరైతే కులం కట్టుబాట్లను.. ఇతర సంప్రదాయాలను తెంచుకొని మరి పెళ్లి చేసుకుంటున్నారు. సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. ఇంకొందరేమో పెళ్లిళ్లు కాక జీవితాన్ని ఒంటరిగానే గడుపుతున్నారు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేదు. దేశంలో దాదాపుగా పరిస్థితి మొత్తం ఇలానే ఉంది. అమ్మాయిల సంఖ్య తగ్గడం లేదా అమ్మాయిలకు రిక్వైర్మెంట్లు పెరిగిపోవడంతో చాలా మంది యుక్త వయసు అబ్బాయిలకు వివాహాలు జరగడం లేదు. కానీ ఈ కథనంలో అబ్బాయి కథ మాత్రం వేరు.
అతడి పేరు వసీం షేక్. స్వస్థలం బెంగళూరు. అక్కడే ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉన్నత చదువులు చదివాడు. చూసేందుకు అందంగా ఉంటాడు. అదే అతడికి అదనపు ఆకర్షణగా మారింది. అది ఎంతవరకు దారితీసింది అంటే.. అతని జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. అతడి అందానికి ఫ్లాట్ అయిన షిఫా షేక్, జన్నత్ అనే ఇద్దరు యువతులు ప్రేమించారు . అంతేకాదు ముగ్గురు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ముగ్గురు అభిప్రాయాలను పంచుకోవడం.. భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ద్వారా గాఢంగా కలిసి పోయారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి దాకా వచ్చేశారు. దీంతో ఒకే వేదికపై వివాహం చేసుకున్నారు.. వారి సంప్రదాయం ప్రకారం కల్యాణ క్రతువును జరుపుకున్నారు.
ఒకే వేదిక మీద ఇద్దరు అమ్మాయిలని వసీం వివాహం చేసుకోవడం బెంగళూరులోనే కాదు, దేశంలోనే చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో వీరి ముగ్గురు గురించే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నేటి కాలంలో పెళ్లిళ్లు జరగడమే కష్టంగా ఉంటున్న నేపథ్యంలో వసీం ఏకంగా ఇద్దరి అమ్మాయిలను చేసుకోవడం సంచలనంగా మారింది. పైగా వారిద్దరిని పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవడం మరింత చర్చకు దారి తీస్తోంది. వీరి ముగ్గురిని ఒకే వేదిక మీద చూసిన బంధువులు ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. మరికొందరైతే విజయ్ సేతుపతి, సమంత, నయనతార కాంబినేషన్లో వచ్చిన కన్మణి, రాంబో, ఖతిజా సినిమా మాదిరిగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇద్దరి మహిళలని ప్రేమించడం.. వారిద్దరిని ఒప్పించి ఒకే వేదిక మీద పెళ్లి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని.. వసీం పెద్ద అద్భుతమే చేశాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.