Lalita Disilva : ఇటీవల భారత కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారధులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళ ఆ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆమెకు అంబానీ కుటుంబ సభ్యులు ఎదురేగి స్వాగతం పలికారు. అనంత్ అంబానీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆమె కూడా అతడిని ఆ లింగనం చేసుకొని, నుదుటిమీద ఒక ముద్దు పెట్టింది. వీవీవీఐపీ స్థాయిలో ఆమెకు అంబానీ కుటుంబం మర్యాదలు కల్పించింది. ఆమె పేరు పొందిన వ్యాపారవేత్త కాదు. రాజకీయ నాయకురాలు అంతకన్నా కాదు. అంబానీ కుటుంబం ఆమెకు ఇచ్చిన ప్రాధాన్యంపై నెట్టింట జోరుగా చర్చ జరిగింది. ఆమె నేపథ్యంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోళ్లు వెళ్లబెట్టారు.
మనదేశంలో పేరుపొందిన వాళ్ల పిల్లలకు నానిగా లలితా డిసిల్వా సుపరిచితురాలు. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని లలిత చిన్నప్పుడు లాలించారు. కరీనాకపూర్ పిల్లలకు కూడా ఆమె ఆయాగా వ్యవహరించారు. ప్రస్తుతం రామ్ చరణ్ -ఉపాసన దంపతుల కుమార్తె క్లీం కారా బాగోగులను లలిత చూసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలతో గడపడం లలితకు చాలా ఇష్టం. అందుకే ఆమె నర్సింగ్ చదివింది. కొన్ని సంవత్సరాలపాటు చిన్న పిల్లల నర్స్ గా పని చేసింది. లలిత స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. తల్లి గార్మెంట్ ఫ్యాక్టరీలో కార్మికురాలుగా పనిచేసేది. లలిత పుట్టింది, పెరిగింది, చదువుకున్నదీ మొత్తం ముంబైలోనే. ఆమె భర్త పేరు జూబర్ట్ డిసిల్వా. ఆయన ఒక ఫ్యాషన్ డిజైనర్. వీళ్ళిద్దరికీ ఒక అబ్బాయి ఉన్నాడు. అతడి పేరు క్లింట్. అతడు వ్యాపారం చేస్తుంటాడు.
1996లో ముంబైలో ఆసుపత్రిలో లలిత నర్స్ గా పనిచేస్తూ ఉండేది. ఆ సమయంలో ఆమె పని విధానాన్ని గమనించిన ఓ వ్యక్తి ఆయాగా పనిచేస్తారని అడిగారు. అలా ఆమె తొలిసారిగా అనంత్ అంబానీ కి నానిగా పనిచేసింది. ఆ సమయంలో అంబానీ కుటుంబం ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంది. వాళ్లంతా కూడా ఆమెను సిస్టర్ లతా అని పిలిచేవారు.. అయితే లత కరీనాకపూర్ పిల్లలకు కేర్ టేకర్ గా మారినప్పుడు ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు. 2016 డిసెంబర్ నుంచి గత సంవత్సరం ఆగస్టు వరకు కరీనాకపూర్ కుమారుడు తైమూర్ కు లలిత కేర్ గా ఉన్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్ – ఉపాసన దంపతుల కుమార్తె క్లీంకారాకు లలిత కేర్ గా మారారు. పాప క్లీనింగ్, ఆహారం తినిపించడం లాంటి మొత్తం ఆమె చేస్తున్నారు. రామ్ చరణ్ – ఉపాసన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. పాప విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఉపాసన – చరణ్ లలితతో ఎంతో ప్రేమగా ఉంటారు.
లలితా రెండు సంవత్సరాల క్రితం మంత్ర పేరుతో ఒక ఏజెన్సీ ప్రారంభించారు. నానీ, హెల్పర్లు కావలసినవారు ఆ ఏజెన్సీని సంప్రదించి సేవలు పొందొచ్చు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కుమార్తెకు కేర్ గా పని చేస్తున్నందుకు లలితకు ప్రతినెల 2 లక్షలకు పైగా వేతనం ఇస్తున్నారు. ఇక ఏజెన్సీ ద్వారా కూడా లలిత దండిగాని సంపాదిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా లలిత 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. ఆమె కొడుకుకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆమెకేర్ టేకర్ గా తన కెరియర్ మొదలుపెట్టారు. కొన్నిసార్లు రాష్ట్రాలు దాటి వెళ్లారు. విదేశాలకు సైతం వెళ్లి వచ్చారు. ఆ సమయంలో లలిత కుమారుడిని ఆమె భర్త, అత్త చూసుకున్నారు.