journalism mistake : అప్పట్లో ఒక వీడియో తెగ సర్కులేట్ అయ్యేది. వార్తలు చదివే ఓ వ్యక్తి తనకు వచ్చే స్క్రిప్ట్ చండాలంగా ఉండడంతో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు. చివరికి తన అసహనాన్ని ఆపుకోలేక తగలబెట్టండి నిరంజన్ గారు అనేవాడు. ఆ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ఈ కథనం చదివేయండి మీకే తెలుస్తుంది.
ప్రస్తుతం రంజాన్ మాసం. ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ సమయంలో ఇఫ్తార్ ఇవ్వడం సహజం. ఇఫ్తార్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు.. పేర్లు మీడియాలో రావాలని చాలామంది కోరుకుంటారు. అందులో తప్పులేదు. తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు..
కానీ, ఓ పత్రికా విలేఖరికి రంజాన్ సందర్భంగా నిర్వహించిన ఖురాన్ పారాయణం పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. అతడు పని చేసేది ఓ పిడిఎఫ్ పేపర్లో. మేనేజ్మెంట్ ఏవో టార్గెట్లు ఇచ్చినట్టు ఉంది. రిపోర్టర్ అంటే అంతే కదా.. ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే పిడిఎఫ్ మీడియా వరకు అంతట ఇదే దురవస్థ . సదరు రిపోర్టర్ ఖురాన్ పారాయణం నిర్వహించిన వారితో మాట్లాడుకున్నట్టున్నాడు. ప్రకటన ఇస్తామని చెప్పినట్టున్నారు. దీంతో రిపోర్టర్ డెస్క్ కు ఆ వార్త పంపించాడు.
యాడ్ ఆబ్లికేషన్ కావడంతో.. ఈ వార్తకు రెండు ఫోటోలు వాడాలని గమనిక లాగా పెట్టాడు. రిపోర్టర్ తన స్థాయిలో బాగానే పనిచేశాడు. కానీ ఎటు వచ్చి డెస్క్ లో సబ్ ఎడిటర్ తన ధర్మాన్ని పక్కన పెట్టాడు. తన విధికి దూరంగా జరిగాడు. రిపోర్టర్ “రంజాన్ పండుగ సందర్భంగా మన పత్రికకు యాడ్ ఇస్తానని అన్నారు. అందువల్ల ఈ రెండు ఫోటోలు వాడగలరు” అని వార్త ముందు మాటలో ప్రస్తావిస్తే.. దానిని ఆ సబ్ ఎడిటర్ యధావిధిగా పేజీలో కూర్చాడు. ఇచ్చిన వార్తకు శీర్షిక కూడా పెట్టలేని స్థాయిలో ఆ ఉపసంపాదకుడు ఉన్నాడంటే మామూలు విషయం కాదు.
ఈ పిడిఎఫ్ పేపర్ మాత్రమే కాదు.. పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో కూడా ఇదే పరిస్థితి. నేటి కాలంలో తెలుగు మాట్లాడటం పూర్తిగా తగ్గిపోయింది. తెలుగులో చదవడం ఇంకా తగ్గిపోయింది. తెలుగు వచ్చిన ఉపసంపాదకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. అందువల్లే ఇదిగో ఇలాంటి తప్పులు గోచరిస్తున్నాయి.. కాదు కాదు కాస్తో కూస్తో జర్నలిజం తెలిసిన వారి మతులను పోగోడుతున్నాయి. ఈ వ్యవహారం గురించి ఇంకా లోతుగా రాయొచ్చు. కానీ, జర్నలిజం అనేది పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన తర్వాత కొత్తగా చెప్పడానికి.. లోతుగా రాయడానికి.. వివరంగా విశ్లేషించడానికి ఏమీ లేదు.