Italy
Italy: పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సౌకర్యాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది గ్రామీణులు అటువైపు మొగ్గు చూపుతుంటారు. పల్లెల్లో నివాసం ఉండేవారు కరువవుతున్నారు. దీంతో గ్రామాలు సహజత్వం కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటలీ(Itali)లోని ఓ ప్రాంతం ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. తమ గ్రామాల్లో స్థిరపడే వారికి లక్షల రూపాయల నజరానా ఇస్తామని చెప్పింది. అయితే, ఈ పథకం కేవలం ఇటలీవాసులు, విదేశాల్లోని ఇటాలియన్లకు మాత్రమే అని స్పష్టం చేసింది.
Also Read: హైదరాబాద్ జీవన వ్యయం.. బతకడానికి ఎంత కావాలో తెలుసా?
వలసలతో…
ఉత్తర ఇటలీలోని ట్రెంటినో ప్రావిన్సు అందమైన పర్వత ప్రాంతం. కానీ, ఇక్కడి ప్రజలు పట్టణాలకు వలస వెళ్తుండటంతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. నివాసితుల కంటే పాడుబడిన ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. జనాభా తగ్గడం(Papulation Decrese)తో ఈ గ్రామాలు ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సుమారు 33 ప్రాంతాలు ఈ సంక్షోభంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వృద్ధ జనాభా ఎక్కువగా ఉండటంతో పాఠశాలలు, దుకాణాలు, గ్యాస్ స్టేషన్లు మూతపడుతున్నాయి. దీంతో జనాభాను ఆకర్షించేందుకు స్థానిక అధికారులు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇది నిర్మాణ రంగానికి, సప్లై చెయిన్కు ఆర్థికంగా ఊతమిస్తుందని వారు భావిస్తున్నారు. 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలను ఈ పథకంలో పరిగణనలోకి తీసుకుంటారు. బడ్జెట్ కేటాయింపులు పూర్తయ్యాయి, త్వరలోనే ఈ ప్రాజెక్టు ఆమోదం పొందనుంది.
నజరానా ఇలా..
ఈ పథకం కింద స్థిరపడే వారికి 1 లక్ష యూరోలు (సుమారు రూ.92 లక్షలు) గ్రాంట్ ఇస్తారు. ఇందులో 80 వేల యూరోలు (రూ.74 లక్షలు) ఇంటి పునరుద్ధరణకు, 20 వేల యూరోలు (రూ.18 లక్షలు) ప్రాపర్టీ కొనుగోలుకు కేటాయిస్తారు. అయితే, కొన్ని నిబంధనలు విధించారు. ఈ ఆఫర్ ఇటలీవాసులు, విదేశాల్లోని ఇటాలియన్లకు మాత్రమే. 45 ఏళ్లు పైబడిన స్థానికులు దీనికి అనర్హులు.
జనాభా తగ్గుదల..
ఇటలీలో జనాభా రేటు తక్కువగా ఉంది. 2040 నాటికి పని చేసే వయసు వారి సంఖ్య 19% తగ్గవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 100 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2014లో 17 వేలు ఉంటే, 2024లో 22 వేలకు పెరిగింది. గతంలోనూ అబ్రుజోలోని పెన్నే పట్టణం పాడుబడిన ఇళ్లను 1 యూరోకు విక్రయిస్తామని ప్రకటించింది.