Maharaja Ranjit Singh: చరిత్ర ఎప్పుడూ జరిగిన విషయాన్ని చెప్తుంది. అది నిజమా, అబద్దమా అనేది మనమే తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయాలలో సొంత పరిజ్ఞానం ఎప్పటికీ పనికిరాదు. అలా సొంత భాష్యం చెబితే చరిత్రకు చెదలు పడుతుంది. చెదలు పడితే నిజం మరుగున పడిపోయి.. అబద్ధం వ్యాప్తిలోకి వస్తుంది. ప్రస్తుతం హీరా మండి పై జరుగుతున్న చర్చ కూడా అటువంటిదే కావచ్చు. సంజయ్ లీలా బన్సాలి రూపొందించిన హీరా మండి వాస్తవానికి దూరంగా, కల్పిత కథకు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తోంది.. సంజయ్ తన సినిమాటిక్ లిబర్టీకి కొంత స్వేచ్ఛ తీసుకున్నప్పటికీ.. హీరా మండి అంటే వేశ్య వాటిక అని దాదాపుగా తేల్చేశాడు. కానీ, హీరా మండి అనేది విలాస వస్తువు కాదు. సంభోగానికి విడిది కేంద్రం కాదు. అది చారిత్రాత్మక ఆనవాలు. ఘనమైన సంస్కృతికి కేంద్రం. అంతకుమించిన ప్రేమ కథకు అది ఒక సజీవ తార్కాణం.
చాలామంది ప్రేమ గురించి చెప్తే .. వాలంటైన్ పేరు మాత్రమే ప్రస్తావిస్తారు. కానీ కాలగర్భంలో వాలంటైన్ కు మించిన ప్రేమికులు చాలామంది ఉన్నారు. అందులో మహారాజా రంజిత్ సింగ్ ఒకరు.. హీరా మండి ప్రాంతానికి చెందిన ఒక నర్తకిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు. కొరడా దెబ్బలను ధైర్యంగా స్వీకరించారు.
పాకిస్థాన్లోని లాహోర్ లో హీరా మండి ప్రాంతం ఉండేది. అది వేశ్యలకు నిలయం. ఆ ప్రాంతంలో మోరన్ అనే నర్తకి ఉండేది. ఆమెపై మహారాజా రంజిత్ సింగ్ కు గాడమైన ఆప్యాయత ఉండేది. మొఘలుల పరిపాలన కాలంలో హీరా మండి ప్రాంతాన్ని షాహి మొహల్లా అని పిలిచేవారు. ఇది సంస్కృతి, కళలు, వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది. అయితే ఆ ప్రాంతానికి హీరా మండి అనే పేరు ఎలా వచ్చిందని దానికి భిన్నమైన వాదనలు ఉన్నాయి.
మొఘలుల కాలంలో ఈ ప్రాంతంలో హీరా(వజ్రాలు) వ్యాపారం కారణంగా దీనికి ఆ పేరు వచ్చిందని కొందరు అంటుండగా.. 18 వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ నేతృత్వంలో సిక్కులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత హీరామండి అని పేరు మార్చారని మరికొందరు అంటుంటారు. మహారాజా రంజిత్ సింగ్ ఆధ్వర్యంలో 1799 లో సిక్కులు లాహోర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతానికి రాజధానిగా గుజ్రాన్ వాలా ను ఏర్పాటు చేశారు.. అయితే ఇప్పుడు లాహోర్, గుజ్రాన్ వాలా రెండూ పాకిస్తాన్ లో ఉన్నాయి. మహారాజా రంజిత్ సింగ్ తన రాజధానిని లాహోర్ ను ప్రకటించడం వెనుక అనేక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి. అతడు మరణించేవరకు ఆ ప్రాంతంలో ఉన్నాడని.. మోరాన్ పై ఉన్న ప్రేమ కారణంగా అతడు శాశ్వతంగా అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేశాడని ప్రచారంలో ఉంది.
మొఘలుల పరిపాలన కాలంలో ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి మహిళలను రాజసభలో వయోజన వినోదం కోసం హీరా మండి ప్రాంతానికి తీసుకొచ్చేవారు. వీరు శాస్త్రీయ కథక్, ముజ్రా, తుమ్రీ, గజల్, దాద్రా వంటి వివిధ కళల్లో సిద్ధహస్తులు. శాస్త్రీయ నృత్యం చేసేవారు. గానంలో కూడా ప్రావీణ్యులు గా ఉండేవారు. వీరిని ఆ కాలంలో తవైఫ్ లు గా పిలిచేవారు. హీరా మండి ప్రాంతం మొఘలుల పరిపాలన కాలంలో ఇక్కడ వ్యభిచారం జరిగేది.. 18 శతాబ్ద కాలంలో ఔరంగజేబు మరణం తర్వాత తర్వాత మొఘలుల సామ్రాజ్యం క్షీణించడం మొదలుపెట్టింది. 1748 జనవరి 12న అహ్మద్ షా దురానీ, ఆఫ్ఘనిస్తాన్ దళాలు లాహోర్ లోకి ప్రవేశించాయి.. వీరి పరిపాలన కాలంలో హీరా మండి ప్రాంతంలో వ్యభిచారం మరింత పెరిగింది.
1799లో మహారాజా రంజిత్ సింగ్ లాహోర్ ను ఆక్రమించేంతవరకు పరిస్థితి అలా ఉండేది. మార్చి 1802 లో హోలీ కి కొద్దిరోజుల ముందు రంజిత్ సింగ్ కు షాహీ మొహల్లా లో 12 సంవత్సరాల నర్తకి మోరన్ సర్కార్ గురించి తెలుసుకున్నాడు. ఒకరోజు సాయంత్రం రంజిత్ సింగ్ హీరా మండి ప్రాంతానికి వెళితే.. సన్నని, పొడుగ్గా ఉన్న మోరన్ అతడికి కుంకుమ పువ్వు కలిపిన తమలపాకు అందించింది.. మోరన్ చేస్తున్న నృత్యానికి రంజిత్ సింగ్ మంత్రముగ్ధుడయ్యాడు. ఆ తర్వాత ఆమెను తనలో లీనం చేసుకున్నాడు. ఇలా ఎన్నో రాత్రులు ఆమెతో గడిపాడు. ఈ నేపథ్యంలో ఆమెను ఉంపుడు గత్తేగానే ఉంచుకోకుండా వివాహం చేసుకున్నాడు..
మోరన్ ను వివాహం చేసుకున్నందుకు గానూ అకల్ తఖ్త్ జారీ చేయడంతో రంజిత్ సింగ్ అమృత్ సర్ వెళ్ళాడు. అక్కడ అకాలీ పూలా సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో తనను క్షమించమని రంజిత్ సింగ్ కోరాడు. తాను సిక్కుల గౌరవానికి భంగం కలిగించానని వేడుకున్నాడు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా రంజిత్ సింగ్ చొక్కా విప్పి 100 కొరడా దెబ్బలు తినాలని పూలా సింగ్ పంత్ ఆదేశించాడు. ఈ క్రమంలో మండే ఎండలో, చింత చెట్టుకు అతడిని కట్టివేశారు. అలా వంద కొరడా దెబ్బలు కొట్టారు. మోరన్ మీద ఉన్న ప్రేమతో రంజిత్ సింగ్ అలానే దెబ్బలు తిన్నాడు.
మోరన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. సిక్కు మతంలోకి మారమని రంజిత్ సింగ్ ఎప్పుడూ అడగలేదు.. పైగా హీరా మండి సమీపంలో ఆమె కోసం పప్పర్ మండిలో ఒక మసీదు కూడా నిర్మించాడు.. ఆమెతో చాలాకాలం పాటు అక్కడ నివసించాడు. ఆమె పేరు మీద బంగారు, వెండి నాణెలు ఆవిష్కరించాడు. వాటికి మోరన్ సర్కార్ అని పేరు పెట్టాడు. 1849 లో మహారాజా రంజిత్ సింగ్ మరణించారు. 1849లో పంజాబ్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులు ఆక్రమించిన తర్వాత..హీరా మండి తన సాంస్కృతిక వైభవాన్ని కోల్పోయింది.