Babylonian Civilization: కోతి నుంచి మనిషి ఉద్భవించాడు. ఆ మనిషి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందే క్రమంలో నాగరికతను, సంస్కృతిని ఒంట పట్టించుకున్నాడు. అలా దినదిన ప్రవర్థమానంగా ఎదిగి ప్రపంచం మొత్తం విస్తరించాడు. ఈ భూమి మీద అత్యంత తెలివైన జంతువుగా అవతరించాడు. నాగరికతను, సంస్కృతిని, అభివృద్ధిని, తన జాతి విస్తరణను ఇలా అన్ని అంశాల్లో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టాడు.. అయితే మనిషి మనుగడను మార్చినవి ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది హరప్పా సింధు సంస్కృతి, బాబిలోనియన్ నాగరికత.
బాబిలోనియన్ నాగరికత విలసిల్లిందని చెప్పడానికి ఈ భూమ్మీద ఇరాన్ దేశంలో దానికి సంబంధించిన ఆనవాళ్లు నేటికీ కనిపిస్తుంటాయి. బాబిలోనియన్ నాగరికత మనిషిలో మానవత్వాన్ని తట్టి లేపిందని చరిత్రకారులు చెబుతుంటారు. బాబిలోనియన్ నాగరికత మెసొపొటేమియా నాగరికతలో ముఖ్యమైన భాగం. సుమేరియన్ నాగరికత విధ్వంసమైన తర్వాత బాబిలోనియన్ నాగరికత అభివృద్ధి చెందడం మొదలైందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆమోరీయులు ఈ నాగరికతకు స్థాపకులుగా ఉన్నారు. ఆమోరీయుల రాజుగా హమ్ము రాబి ఉండేవాడు. వందల ఏళ్లనాటి కాలంలోనే బాబిలోనియన్లు చరిత్ర, రచనలు, సాహిత్యం, మతం, వాస్తు శిల్పం, సైన్స్, కళా రంగాలలో తమ ప్రతిభను చూపించేవారు.
ముందుగానే చెప్పినట్టు సుమేరియన్ నాగరికత ధ్వంసమైన తర్వాత బాబిలోనియన్ ప్రజలు తమ నాగరికతను విస్తరించడం మొదలుపెట్టారు. సుమేరియన్ ప్రజల లాగానే క్యూనిఫారం రచనను బాబిలోనియన్ ప్రజలు ఉపయోగించారు. వారు తమ రచనల్లో 350 కంటే ఎక్కువ సంకేతాలను ఉపయోగించారు. ఎముకలు, వెదురుతో తయారుచేసిన పెన్నుతో మెత్తని మట్టి పలకలపై రాతలు రాసేవారు. హమ్ము రాబి పరిపాలన కాలంలో విద్యార్థుల కోసం ఎన్నో పాఠశాలలను స్థాపించాడు. బాబిలోనియన్ యువకులు రాయడం, పఠనం, గణితం వంటి విభాగాలలో నేర్పరులు. అమ్మాయిలు పాటలు, నృత్యాలలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించేవారు. “రాతలు రాణించగలవాడు సూర్యుడిలా ప్రకాశించగలుగుతాడు” బాబిలోనియన్ల సంస్కృతి అంతమైన తర్వాత.. చరిత్రకారుల పరిశోధనలో నాటి గోడలపై లభ్యమైన వాక్యం ఇది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వారు విద్యకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చేవారో..
బాబిలోనియన్ ల సాహిత్యం చాలా గొప్పది. బాబిలోనియన్లు దాదాపు 2000 పుస్తకాలు రాశారు. మతం, సైన్స్, గణితం, జ్యోతిష్య శాస్త్రం పై పుస్తకాలు రచించారు. బాబిలోనియన్లు రాసిన సాహిత్యంలో గిల్గమేష్ ప్రత్యేక స్థానాన్ని పొందాడు.. ఒకసారి దేవుడు బాబిలోనియన్ల మీదకు వర్షాలు సృష్టించి.. భీకరమైన వరదను పంపాడు. అయితే ఒక రుషి ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజు గిల్గమేష్ ఆ వరదలను నియంత్రించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హమ్ము రాబి పరిపాలన కాలంలో మతం, వ్యవసాయం, పరిపాలన, వివిధ రకాల చట్టాలు అమల ల్య్యేవి. వీటిని అత్యంత సరళమైన రూపంలో హమ్మురాబి క్రోడీకరించాడు. ఇది హమ్మురాబి కోడ్ గా ప్రసిద్ధి చెందింది. అతని పరిపాలన కాలంలో చట్టాలను 8 అడుగుల ఎత్తులో ఉన్న డయోరైట్ రాళ్లపై చెక్కాడు. ఆ రాళ్ళను బాబిలోనియన్ దేవుడు మర్దుక్ ఆలయంలో ఏర్పాటు చేశాడు. ఈ రాళ్ల పై భాగంలో సమస్(సూర్యుడు) చిత్రాన్ని చెక్కారు. అంటే అతని ప్రకాశంలో చట్టాలు వెలిగిపోతున్నాయని చెప్పడం వారి ఉద్దేశం.
ఇలా కొన్నేళ్లపాటు బాబిలోనియన్ ల సంస్కృతి విలసిల్లింది. మానవ నాగరికత అభివృద్ధి చెందడంలో తన వంతు పాత్ర పోషించింది. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో ముఖ్య భూమిక పోషించింది. నేడు మనం పాటిస్తున్న కళ, వాస్తు శిల్పం, సైన్స్, వాణిజ్య రంగాలు బాబిలోనియన్ల కాలంలో పురుడు పోసుకున్నవే. ఒకప్పుడు ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ఆ సంస్కృతి నేడు కాలగర్భంలో కలిసిపోయింది. ఇరాన్ దేశంలో బాబిలోనియన్ల పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన భవనాలు నేటికీ కనిపిస్తుంటాయి. కాకపోతే అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. చరిత్రకారులు అప్పుడప్పుడు ఆ ప్రాంతంలో తవ్వకాలు, ఇతర పరిశోధనలు చేపడుతుంటారు.