Humans Change 2050: ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవి. ఆ తర్వాత డబ్బా ఫోన్లు వచ్చాయి.. కొంతకాలానికి ఫోన్ అనేక రకాలుగా మారింది. అనేక రూపాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మనిషి జీవితాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తోంది. కేవలం మాటలు మాత్రమే కాదు, డబ్బు చెల్లింపులు.. వీడియో కాలింగ్… ఇలా ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే సాధ్యమవుతోంది. స్మార్ట్ ఫోన్ ఒకరకంగా మనిషి జీవితంలో విడదీయరాని భాగం అయిపోయింది. నేటి ప్రపంచం మొత్తం స్మార్ట్ఫోన్ చుట్టూ తిరుగుతోంది. స్మార్ట్ఫోన్ ఆధారంగా లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది.
శాస్త్ర సాంకేతిక రంగాలలో అనేక మార్పులు రావడంతో కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అవి మనిషి జీవితాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సోషల్ మీడియా యాప్స్ వల్ల మనిషి సమూలంగా మారిపోతున్నాడు. అస్తమానం ఫోన్లోనే ఉండడంవల్ల బయట ఏం జరుగుతుందో కూడా మర్చిపోతున్నాడు. పక్కనున్న మనిషితో మనస్ఫూర్తిగా నాలుగు మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాడు. గంటల తరబడి ఫోన్లోనే నిమగ్నమై ఉండడం వల్ల మనిషి వెన్నెముక, తలభాగాలలో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మెడ భాగంలో విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. ఈ తరహా వ్యాధులతో బాధపడే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయిందని వైద్యులు చెబుతున్నారు.. నేత్ర, మెదడు, మెడ, వెన్నెముక వంటి అంగాలలో సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు.. కొంతమందిలో అదేపనిగా ఫోన్ ను చూడడం వల్ల దృష్టిలోపం కూడా ఏర్పడుతోందని వైద్యులు అంటున్నారు.
శరీర అవయవాలలో మార్పులు మాత్రమే కాకుండా అదే పనిగా ఫోన్ చూడటం వల్ల ఇంకా అనేక మార్పులు వస్తాయని ఓ పరిశోధనలో తేలింది.. ఫోన్ అడిక్షన్ వల్ల.. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది.. ఎటు కదలకుండా కేవలం ఫోన్లోనే పోయే వారి సంఖ్య పెరుగుతుంది. ఇలా ఫోన్లో మునిగిపోయేవారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ వీ వార్డ్ ఒక ఫోటోను షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయినట్టు.. జుట్టు రాలిపోయినట్టు.. వృద్ధాప్యం ముందే వచ్చినట్టు.. ముఖంపై డార్క్ సర్కిల్స్ ఏర్పడినట్టు.. ఊబకాయం వచ్చినట్టు ఆ ఫోటోను రూపొందించింది. ఇది కేవలం ఫోటో మాత్రమే కాదని.. భవిష్యత్తు కాలంలో మన శరీరంలో ఇటువంటి మార్పులు వస్తాయని హెచ్చరించింది.. ఇది కేవలం ఊహించి రూపొందించలేదని,. అనేక ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారం ద్వారా దీనిని రూపొందించామని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.