Hippopotamus: హిప్పోపొటామస్ చెమట నిజంగా గులాబీ రంగులో ఉందా? సైన్స్ చెప్పేది ఏంటంటే..??

హిప్పోపొటామస్ అంటే గ్రీకులో ‘నీటి గుర్రం’ అని అర్థం. కాగా వీటి చెమటతో పాటు పాలు కూడా గులాబీ రంగులో ఉంటాయని చెబుతుంటారు. గత కొన్నేళ్లుగా దీనిపై పలువురు పలు అనుమానాలు ఉన్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ఫేస్ బుక్ పేజీలో దీని గురించి పోస్ట్ చేయడంతో మరోసారి ఈ విషయంపై చర్చ జోరందుకుంది.

Written By: Swathi Chilukuri, Updated On : May 14, 2024 3:34 pm

Hippopotamus

Follow us on

Hippopotamus: హిప్పోపొటామస్.. ఆఫ్రికాలోని అత్యంత ప్రమాదకరమైన జంతువుల్లో ఇది ఒకటి. పెద్ద దంతాలు, దూకుడు స్వభావాన్ని కలిగి ఉన్న ఈ భారీ శాకాహార జీవులు నీటి అడుగున నిద్రపోయే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు ఏనుగు, ఖడ్గమృగం తరువాత హిప్పోపొటామస్ భూమిపై మూడవ అతిపెద్ద క్షీరదం. నీటిలో ఎక్కువ సమయం గడిపే జంతువు అయినప్పటికీ నీటి అడుగున ఈత కొట్టలేవు.

హిప్పోపొటామస్ అంటే గ్రీకులో ‘నీటి గుర్రం’ అని అర్థం. కాగా వీటి చెమటతో పాటు పాలు కూడా గులాబీ రంగులో ఉంటాయని చెబుతుంటారు. గత కొన్నేళ్లుగా దీనిపై పలువురు పలు అనుమానాలు ఉన్నాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ఫేస్ బుక్ పేజీలో దీని గురించి పోస్ట్ చేయడంతో మరోసారి ఈ విషయంపై చర్చ జోరందుకుంది.

హిప్పోపొటామస్ పాలు గులాబీ రంగులో ఉంటాయా? అనే విషయాన్ని తేల్చడానికి పరిశోధనలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇతర క్షీరదాల తరహాలోనే హిప్పోల పాలు తెలుపు లేదా క్రీమ్ రంగులో ఉంటాయని వెల్లడైంది. దీంతో హిప్పోపొటామస్ పాల రంగు గులాబీ రంగులో ఉండవని తెలుస్తోంది. కానీ చాలామంది హిప్పోపొటామస్ పాలు పింక్ కలర్ లో ఉంటాయని ఎందుకు అంటారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది.

సాధారణంగా హిప్పోపొటామస్ చెమట గులాబీ రంగులోనే ఉంటుందని శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీలో జీవశాస్త్ర ప్రొఫెసర్, ఐయూసీఎన్ ఎస్ఎస్సీ హిప్పో స్పెషలిస్ట్ గ్రూప్ సహ రచయిత తెలిపారు. నిజానికి ఇది చెమట కాదని.. యాంటీ బయాటిక్, సన్ స్క్రీన్ మరియు యాంటీ మైక్రోబయాల్ సమ్మేళనాలన్నీ కలిసి విడుదలైన చర్మ స్రావమని పేర్కొన్నారు. హిప్పోల శ్లేష్మ గ్రంథుల నుంచి వచ్చే జిడ్డుగల స్రావం. వాటి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ స్రావం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అలాగే ఈ పదార్థం హిప్పోపొటామస్ చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది.

హిప్పోపొటామస్ శరీరం నుంచి విడుదలయ్యే స్రావం చెమట తరహాలోనే రంగులేనిగా ఉన్నప్పటికీ.. ఎండ ప్రభావానికి ఎరుపు, నారింజ లేదా గులాబీ రంగులోకి మారుతుందంట. కొన్ని గంటల తరువాత గోధుమ రంగులోకి ఛేంజ్ అవుతుంది. హిప్పో తన పిల్లలుకు పాలు ఇచ్చే సమయంలో ఈ స్రావం పాలతో కలిసి గులాబీ రంగులో కనిపించే అవకాశం ఉందని చెప్పారు. అంతేకానీ నిజానికి హిప్పోల పాలు గులాబీ రంగులో ఉండవని పేర్కొన్నారు. ఒకవేళ పింక్ కలర్ లో కనుక ఉన్నట్లయితే హిప్పోలు రక్తసంబంధిత సమస్యతో బాధపడుతుండవచ్చని తెలియజేశారు.

అయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ హిప్పోలు అంతరించేపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిప్పో జాతులు, పిగ్మీ హిప్పో పశ్చిమ ఆఫ్రికాకు చెందిన అంతరించిపోతున్న జాతి అని చెబుతున్నారు.