Dhurwa Mutton Chawal: పీల్చేగాలి.. తాగే నీటి తర్వాత మనిషికి కావాల్సింది ఆహారం. తినే ఆహారంలో మనుషులు రకరకాలను వండుకుంటారు. జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరుస్తుంటారు. కొందరు శాకాహారాన్ని ఇష్టపడితే.. మరికొందరు మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. వారి అభిరుచులకు తగ్గట్టుగా రుచులను మేలవించి కడుపును నింపుకుంటారు. మనదేశంలో ప్రాంతానికి తగ్గట్టుగా వంటకాలు ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతమైన వాడకల్లో ఉండడంతో ఆ వంటకాలు వెలుగులోకి వస్తున్నాయి. అలా వెలుగులోకి వచ్చిన వంటకం ఇది. కాకపోతే దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి…
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భీకరమైన ఆటగాడు.. సమర్థవంతమైన సారధి మాత్రమే కాదు.. అంతకుమించిన భోజన ప్రియుడు. తను తినే తిండిలో రకరకాలను కోరుకుంటాడు. తిన్న తిండికి తగ్గట్టుగా మైదానంలో కసరత్తులు చేస్తుంటాడు. వయసు పై పడుతున్నా తన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడంలో అతడు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు. ధోని స్వగ్రామం రాంచి పచ్చని ప్రకృతికి.. అరుదైన ఖనిజాలకు మాత్రమే కాదు.. అద్భుతమైన వంటలకు కూడా ప్రసిద్ధి. ధోని ఊరిలో ఎన్నో వంటకాలు లభిస్తుంటాయి. కానీ ఒక డిష్ కు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చివరికి ధోని కూడా ఈ వంటకాన్ని తన స్నేహితులకు, అతిధులకు సర్వ్ చేశాడు.
రాంచీలో ఫేమస్ అయిన ఆ వంటకం పేరు దుర్వ మటన్ చావల్. పేరులో ఉన్నట్టుగా ఇందులో మటన్ సర్వ్ చేస్తుంటారు. రొటీన్ మటన్ కాకుండా.. బాగా బలిసిన పొట్టేలు కూరను కట్టెల పొయ్యి మీద వండుతారు. ఇందులో మసాలాలను ప్రత్యేకంగా రూపొందిస్తారు. కూరలో కారం కాకుండా లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేస్తారు. లావు బియ్యంతో అన్నం వండుతారు. వేడి వేడి అన్నాన్ని.. మోదుగ ఆకులతో కుట్టిన విస్తరాకులలో వడ్డిస్తారు. కూరను మోదుగ ఆకులతో కుట్టిన డొప్పలలో వేస్తారు. పచ్చి ఉల్లిగడ్డల ముక్కలు.. నిమ్మకాయ ముక్కలు సర్వ్ చేస్తారు. ఈ ఆహారానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. రాంచీలో పర్యటించడానికి వచ్చే పర్యాటకులు ఈ ఆహారాన్ని కచ్చితంగా తింటారు. ఒక్క ప్లేట్ మటన్ చావల్ కు 250 నుంచి 300 వరకు వసూలు చేస్తారు . యూట్యూబర్ల వల్ల ఈ వంటకం ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు ధోనికి కూడా ఎంత ఇష్టమో అందరికీ అర్థమైంది.