Squirrel: ఈ సృష్టిలో జీవి పరిణామ దశలను బట్టి రంగులు మారుతుంటాయి. కాకపోతే అవి స్వల్ప స్థాయిలోనే ఉంటాయి. ఇక ఈ భూమి మీద రంగులు మార్చే ఏకైకజీవి ఊసరవెల్లి. అది కూడా తన జీవన పరిణామ క్రమంలో చోటు చేసుకునే మార్పుల వల్ల రంగులు మార్చుతూ ఉంటుంది.. కేవలం ఊసరవెల్లి మాత్రమే కాదు.. ఒక ఉడత కూడా ఇలాగే రంగులు మార్చుతూ ఉంటుంది. ఇది మన దేశంలోని అడవుల్లో అరుదుగా కనిపిస్తుంది. ఈ ఉడతను “మలబార్ జెయింట్ స్క్వైరల్ ” అని పిలుస్తుంటారు. ఇది దాదాపు మూడు అడుగుల పొడవు వరకు ఉంటుంది.. మెరూన్, ఊదా, నారింజ, త్రిపురంగుల్లో ఇది కనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే తన రంగు మార్చుకుంటుంది. అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా తన రంగులో మార్పు చూపిస్తుంది. ఈ ఉడత చాలా తెలివైనది. చెట్లపై మూడు లేదా నాలుగు గూళ్లు నిర్మించుకుంటుంది. శత్రువులు ఎదురైనప్పుడు ఒక్కో గూడు మార్చుకుంటూ వెళ్తుంది. మూడు అడుగుల పొడవు మాత్రమే ఉండడంతో ఈ ఉడత ఒక చెట్టుపై నుంచి మరొక చెట్టుకు ఏకంగా 20 అడుగుల దూరం వరకు దూకగలుగుతుంది. దూకుతున్న సమయంలో తన పొడవైన తోకను ఇది పారాచూట్ మాదిరిగా వినియోగించుకుంటుంది.
ఒంటరి జీవనం
ఈ ఉడతలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటాయి. ఎప్పటికీ చెట్ల పైన తిరుగుతుంటాయి. అవసరమైతే తప్ప నేలకు దిగి రావు.. మిగతా విడతలు తమ సంపాదించిన ఆహారాన్ని భూమిలో పాతి పెడతాయి. కానీ ఇవి చెట్ల మీదనే నిల్వ చేసుకుంటాయి. ఇవి పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాయి. కాకపోతే ఆ గింజలను జీర్ణం చేసుకునే శక్తి వీటికి ఉండదు. అందువల్ల గింజలను విసర్జిస్తుంటాయి. ఆ గింజలు నేల మీద పడి మొక్కలుగా మొలకెత్తుతూ ఉంటాయి. తద్వారా అడవి విస్తరణకు తోడ్పడుతూ ఉంటాయి. ఇవి తమ రెండు వెనుక కాళ్లతో చెట్టును అమాంతం పట్టుకుంటాయి. అందంగా వేలాడుతూ ఉంటాయి.. ఆ సమయంలో అవి గబ్బిలాల మాదిరిగా కనిపిస్తాయి. ఇవి విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాయి కాబట్టి.. వీటి సంతతి తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇవి శత్రువుల బెడద నుంచి తమను తాను కాపాడుకోవడంలో చాకచక్యాన్ని ప్రదర్శిస్తుంటాయి కాబట్టి ఎక్కువ కాలం జీవిస్తుంటాయి.. ఇవి దట్టమైన అడవుల్లో నివసిస్తుంటాయి. కేరళ రాష్ట్రంలోని మలబార్ అడవులలో ఇవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అందువల్లే దీనిని “మలబార్ జెయింట్ స్క్వైరల్ ” అని పిలుస్తుంటారు. ఈ ఉడత ఎక్కువగా జామ పండ్లను, సపోటా పండ్లను తింటుంది.. ఆహారం దొరకని పక్షంలో నిల్వ చేసుకున్న గింజలను తిని ఆకలి తీర్చుకుంటుంది.