Chintapalli Sub-Treasury Office: ఇప్పుడంటే అన్నీ మారిపోయాయి. తినే తిండి దగ్గర నుంచి మొదలుపడితే పడుకునే పడక వరకు అన్నింట్లోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి.. కానీ ఒకప్పుడు అలా కాదు.. ఇంటి నిర్మాణ విషయం నుంచి మొదలుపెడితే గల్లా పెట్టె వరకు ప్రతి దాంట్లో కూడా భారీతనం కనిపించేది. ఆ భారీతనంలో కూడా అనేక రకాల హంగులు ఆర్భాటాలు ఉండేవి. అలాగని ఇవన్నీ కూడా అందరి దగ్గర ఉండేవి కాదు.. స్తోమత ఉన్నవారు తమ స్థాయికి తగ్గట్టుగా ఆ వస్తువులను చేయించుకునేవారు. అప్పట్లో కలప విపరీతంగా ఉండేది కాబట్టి.. పైగా వడ్రంగి వారు కూడా విరివిగా ఉండేవారు. అందువల్లే నాటి వస్తువులు భారీతనంతో కనిపించేవి. ఆర్థికంగా స్తోమత ఉన్న వారి ఇంట్లో ఆ తరహా వస్తువులు ఎక్కువగా ఉండేవి.
నాటి రోజుల్లో గృహాల నిర్మాణాలే కాదు.. డబ్బు దాచుకునేందుకు ఉపయోగించే పెట్టె ల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించేవారు. వాటి నిర్మాణాన్ని కూడా అత్యంత దుర్భేద్యంగా ఉండేలా చూసుకునేవారు.. అటువంటి వస్తువులు నేడు కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఆ వస్తువులు ఏదో ఒకచోట బయటపడుతున్నాయి. అవి నాటి చరిత్రకు.. ఇతర విషయాలకు దర్పణంగా నిలుస్తున్నాయి.. అటువంటి వస్తువు ఒకటి బయటపడింది. అది చూసేందుకు అత్యంత భారీతనంతో ఉంది. పైగా దాన్ని తయారు చేయడానికి ఎంతో ప్రయాసపడినట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ పెట్టె ఉంది. దీనిని 1884లో మద్రాస్ లో తయారు చేశారు.. సుమారు 141 సంవత్సరాలు క్రితం దీనిని తయారు చేశారు. దీని బరువు 3000 కిలోలకు పైగా ఉంటుంది. దీని పై కప్పు బరువు దాదాపు 500 కిలోల వరకు ఉంటుంది.. సుమారు ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా శ్రమిస్తే తప్ప ఇది తెరుచుకోదు. చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఇప్పటికీ ఇది భద్రంగానే ఉంది.. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఈ కార్యాలయం ఓకే భవనంలో ఉంది.. నగదు లేదా విలువైన పత్రాలను ఇందులో భద్రపరిచేవారు.. దీనిని పూర్తిగా ఇనుముతో తయారు చేయించారు.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనిని కొద్ది రోజులపాటు ఉపయోగించారు. ఆ తర్వాత దీనిని తెరవడం.. మూయడం సాధ్యం కాక అలానే వదిలేశారు. పూర్తిగా ఇనుముతోనే తయారు చేసినప్పటికీ.. ఇప్పటికీ అది చెక్కుచెదరకుండా ఉంది. కనీసం తుప్పు కూడా పట్టలేదు.. దీనిని అత్యంత నాణ్యమైన ఇనుముతో తయారు చేసినట్టు తెలుస్తోంది.. సబ్ ట్రెజరీ కార్యాలయంలోకి వచ్చిన వారంతా కూడా ఈ పెట్టెను ఆశ్చర్యంగా చూస్తుంటారు.. కొందరు తమ ఫోన్లలో బంధిస్తుంటారు.. నాటి చరిత్రకు.. నేటి వర్తమానానికి ఈ పెట్టే ఒక సాక్షిభూతం లాగా ఉంది.