Camel Tears for Snake bite: నీళ్లు.. ప్రకృతి ప్రసాదించిన వరం.. అయితే పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, వాతావరణ కాలుష్యంతో వర్షాలు తగ్గిపోతున్నాయి. భూమి వేడెక్కుతుండడంతో నదులు, సముద్రాలు ఎండిపోతున్నాయి. మంచు ప్రాంతాలు కరుగుతున్నాయి. దీంతో నీటిని కూడా కొనుక్కుని తాగుతున్నాం. ఈ నీటితోపాటు ప్రపంచంలో అనేక రకాల తాగునీరు దొరుకుతోంది. అందులోని మినరల్స్ ఆధారంగా వాటి ధర ఆధారపడి ఉంది. అయితే.. బికనీర్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ కెమెల్ (ఎన్‌ఆర్‌సీసీ) నిర్వహించిన పరిశోధనలో ఒంటె కన్నీళ్ల చాలా విలువైనవని తేలింది. ఇందులో 26 రకాల విషపూరిత పాముల విషాన్ని నిర్వీర్యం చేయగల యాంటీబాడీలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ యాంటీబాడీలు విషంలోని టాక్సిన్స్‌తో బంధించి, శరీరంపై వాటి ప్రభావాన్ని నిరోధిస్తాయి. ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉంది.
Also Read: మనలాంటి మిడిల్ క్లాస్ కు అసలు భారం ఇదే
భారతదేశంలో పాముకాటు సవాల్..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 81 వేల నుంచి 1.38 లక్షల మంది పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్నారు, ఇందులో భారతదేశంలో సుమారు 58 వేల మరణాలు సంభవిస్తున్నాయి. కింగ్ కోబ్రా, రస్సెల్ వైపర్, కామన్ క్రైట్ వంటి అత్యంత విషపూరిత పాముల కాటు కొన్ని క్షణాల్లోనే మరణానికి దారితీస్తుంది. ప్రస్తుత యాంటీ-వెనమ్ మందులు కొన్ని పాము విషాలపై మాత్రమే పనిచేస్తాయి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు లేకపోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్‌ఆర్‌సీసీ పరిశోధకులు సా-స్కేల్డ్ వైపర్ విషంతో ఒంటెలను రోగనిరోధక శక్తి కల్పించి, వాటి కన్నీళ్లు, రక్తంలోని యాంటీబాడీలను పరీక్షించారు. ఈ యాంటీబాడీలు విషం వల్ల కలిగే రక్తస్రావం, కోగులోపతి వంటి ప్రభావాలను సమర్థవంతంగా నిరోధిస్తాయని తేలింది. సంప్రదాయ గుర్రపు యాంటీ-వెనమ్‌తో పోలిస్తే, ఒంటె యాంటీబాడీలు తక్కువ అలెర్జీ ప్రతిచర్యలతో, అధిక శక్తితో పనిచేస్తాయని ధృవీకరించారు.
Also Read: నో’ చెప్పడం నేర్చుకో.. బాగుపడుతావ్..!
వైద్య రంగంలో కొత్త శకం..
లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ వంటి సంస్థలు కూడా ఒంటె యాంటీబాడీలపై పరిశోధనలు చేసి, వీటిని సమర్థవంతమైన యాంటీ-వెనమ్‌గా మార్చే అవకాశాన్ని ధృవీకరించాయి. ఈ యాంటీబాడీలు విస్తృత శ్రేణి పాము విషాలను నిర్వీర్యం చేస్తాయి. తక్కువ ఖర్చుతో, సురక్షితంగా ఉత్పత్తి చేయగలవు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు బాధితులకు తక్షణ చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, దీనివల్ల వేలాది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది.