Alexander descendants: ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. మనుషుల నివాసానికి యోగ్యంగా ఉన్న ప్రాంతాలలో ఉండేవారు మొత్తం దాదాపుగా ఒకే తీరుగా ఉంటారు. జన్యువుల లోపం వల్ల ఉండేవారు మాత్రమే కాస్త భిన్నంగా ఉంటారు. వారి చర్మం రంగు, జుట్టు రంగు విచిత్రంగా ఉంటాయి. వారు మినహా మిగతా వారంతా రకరకాల వర్ణాలలో ఉంటారు. ఉదాహరణకు మన ఆసియా ఖండంలోని చైనా దేశాన్ని తీసుకుంటే.. అందరూ కాస్త పొట్టిగానే ఉంటారు. చైనా మాత్రమే కాదు, ఆసియా ఖండంలోని ఇతర దేశాలలో కూడా బ్లాక్ అండ్ వైట్ రంగుల వారు ఉంటారు.
మన ఆసియా ఖండంలోనే.. మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశంలో హిందూ కుష్ పర్వతశ్రేణిలో ఉన్న చిత్రాల్ లోయ ప్రాంతంలో కలాష్ ప్రజలు మాత్రం విచిత్రంగా ఉంటారు. వాస్తవానికి పాకిస్తాన్ అనేది మన ఆశ ఖండంలో ఒక దేశమే అయినప్పటికీ.. ఆ దేశంలో నివసిస్తున్న వీరు మాత్రం చూసేందుకు యూరప్, అమెరికా ప్రజల మాదిరిగా ఉంటారు. బంగారు వర్ణపు చర్మం, లేత రంగు నేత్రాలతో ఆసక్తికరంగా కనిపిస్తుంటారు. వీరి జనాభా దాదాపు 3000 వరకు ఉంటుంది. వీరు మేకలను మేపుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుంటారు. అయితే వీరు ఇలా ఉండడానికి కారణాలను శాస్త్రవేత్తలు రకరకాలుగా విశ్లేషించారు.
వీరంతా కూడా అలెగ్జాండర్ వారసులని చెబుతుంటారు. అలగ్జాండర్ సైన్యం ఇండియాపై దండయాత్ర చేసింది. ఆ సమయంలో ఇక్కడ చిక్కుకుపోయిన సైనికులు ఈ ప్రాంతంలోని మహిళలతో లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఆ క్రమంలో వారు గర్భం దాల్చారు. వారికి పుట్టిన సంతానం వల్లే ఇలా ఉన్నారని చరిత్రకారులు చెబుతున్నారు. కలాష్ తెగలు మహిళలకు వారి బుగ్గలు, నుదురు, గడ్డం భాగంలో చిన్న చిన్న పచ్చబొట్లు ఉంటాయి. అంతేకాకుండా వారు తమ జుట్టును అత్యంత పొడవుగా పెంచుకుంటారు. పొడవైన జడలు వేసుకుంటారు. బంగారం, వెండితో తయారుచేసిన ఆభరణాలను ధరిస్తుంటారు. శీతకాలంలో వెచ్చని దుస్తులను, ఎండాకాలంలో నూలు దుస్తులను ధరిస్తుంటారు.
ఇక పురుషులైతే దాదాపు 6 అడుగుల వరకు ఎత్తు పెరుగుతారు. వీరి జుట్టు కూడా బంగారు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. పైగా వీరిలో రోగనిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. మాంసం, పాలు, పండ్లు అధికంగా తీసుకుంటారు. బియ్యాని కంటే కూడా రొట్టెలకు ప్రాధాన్యమిస్తుంటారు. ఎక్కువగా శారీరక శ్రమ చేస్తుంటారు కాబట్టి వీరి సగటు జీవిత కాలం అధికంగా ఉంటుంది.