A Dog’s Love vs Human Selfishness: ఈ భూమ్మీద అత్యంత తెలివైన వాళ్లు.. గొప్పవాళ్లు.. వివేచనతో ఆలోచించేవాళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మనుషుల గురించి చాలా ఉపమానాలు ఉన్నాయి. కానీ మనుషులంత స్వార్థ జీవులు ఈ భూమ్మీద ఎవరూ ఉండరు. ఉండబోరు.
మనుషులు ఎంత స్వార్థమైన వారో.. అవసరాలు తీరిన తర్వాత ఎలా వదిలించుకుంటారో.. అవసరమైతే కఠినంగా ఎలా వ్యవహరిస్తారో.. ఈ సంఘటన నిరూపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లో వేగురుపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో పున్నం మల్లయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు.. ఇతడి పూర్వికులది కూడా ఇదే గ్రామం. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం తన ఇంటి వెనకాల ఒక చిన్న కుక్క పిల్లను మల్లయ్య చూశాడు.. అయితే దానికి తల్లి లేకపోవడంతో ఇంట్లోకి తీసుకొచ్చాడు. పాలు, ఆహారం పెట్టడంతో ఆ కుక్క పిల్ల వారికి అత్యంత దగ్గర అయింది. ఒకరకంగా వారి ఇంట్లో సభ్యురాలు అయింది.. అత్యంత విశ్వాసాన్ని చూపిస్తూ.. మల్లయ్య కుటుంబ సభ్యులు ఏదైనా పనిమీద లేదా వేడుకలకు హాజరవ్వడానికి వెళితే.. ఇంటికి కాపలాగా ఉండేది. పొరపాటున ఎవరైనా తెలియని వారు ఇంటికి వస్తే దాని ప్రతాపాన్ని చూపించేది. అనేక సందర్భాలలో ఆ శునకం దాడులు చేసింది.. దానివల్ల చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడటం మొదలుపెట్టారు. అటువైపుగా వెళ్లాలంటేనే భయపడే స్థితికి చేరుకున్నారు.
Also Read: Himachal : చిరుత పులిని కూడా భయపెట్టే కుక్క? దానితో అంత ఈజీ కాదు..
ఇదే విషయాన్ని మల్లయ్యకు వారు చెప్పారు.. ఆ కుక్క వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.. చుట్టుపక్కల వారు అలా చెప్పడంతో మల్లయ్య తట్టుకోలేక.. ఆ కుక్కను కారులో ఎక్కించుకొని.. అద్దాలు మొత్తం మూసివేసి.. ఆ ఊరికి దూరంగా 70 కిలోమీటర్ల దూరం లో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేసి వచ్చాడు. మల్లయ్య దిగులుతోనే తిరుగు ప్రయాణమయ్యాడు.. అయితే సరిగ్గా ఐదు రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆ కుక్క మల్లయ్య ఇంటికి వచ్చింది. 70 కిలోమీటర్ల అవతల అడవిలో వదిలిపెట్టినప్పటికీ.. దానికి దారి తెలియకుండా అద్దాలు మూసినప్పటికీ.. అది తన ఇంటికి రావడంతో మల్లయ్య ఒకసారిగా షాక్ అయ్యాడు.. అంతే ఆ తర్వాత కుక్కను గట్టిగా పట్టుకుని.. దాని నుదుటిమీద ముద్దు పెట్టాడు.. ” మనుషులకు అవసరాలు ఉంటాయి. కుక్కలకు ప్రేమ మాత్రమే ఉంటుంది. అన్నం పెట్టి.. జాలి చూపించినందుకు.. ఆ కుక్క విశ్వాసాన్ని చూపించింది. ప్రేమను ప్రదర్శించింది. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నా యజమాని ఇంటికి వచ్చింది. ప్రేమ ఎక్కడ ఉన్నా… విశ్వాసం ఎంత దూరంలో ఉన్నా తగ్గిపోదు.. అందుకే కుక్కలను విశ్వాసానికి ప్రతీకలుగా పిలుస్తుంటారు. మనుషులను స్వార్థానికి ప్రతిబింబాలుగా భావిస్తుంటారని” మానసిక నిపుణులు చెబుతున్నారు.
70 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆ కుక్క మల్లయ్య ఇంటికి వచ్చిందంటే.. దానికి తన యజమాని మీద ఉన్న ప్రేమే కారణం.. దాని రక్తంలో ఇమిడిపోయిన విశ్వాసమే కారణం. వాస్తవానికి ఇతరులను కరుస్తుందనే కారణంతో మల్లయ్య దానిని అడవిలో వదిలిపెట్టి వెళ్ళాడు. కాని దానికి కొన్ని రకాల సూది మందులు ఇస్తే.. కొన్ని రకాల మందులు వాడితే దాడి చేయదు అనే విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాడు. అదే కుక్కకు మనిషికి ఉన్న తేడాను సూచిస్తున్నది.