David Ellison 5 days a Week: నేటి కాలంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయింది.. కంపెనీల నుంచి భరోసా దూరమైంది.. పైగా రకరకాల సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల అవసరం కంపెనీలకు అంతగా లేకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు.. యుద్ధాలు వంటివి తీవ్ర ప్రభావాలను చూపిస్తున్నాయి.. అందువల్లే కంపెనీలు ఉద్యోగులను అడ్డగోలుగా తొలగిస్తున్నాయి.. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు.. కానీ ఇప్పుడు ఉద్యోగులను తొలగించడం అనేది పరిపాటిగా మారిపోయింది.
ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉండడం.. తీసివేతలు అధికంగా ఉండడంతో ఉన్న ఉద్యోగులు భయంతో పనిచేస్తున్నారు.. ఉద్యోగాలను కాపాడుకోవడానికి.. సీఈవోల మనసు గెలుచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే సమయానికి మించి పని చేస్తున్నారు. వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతింటున్నప్పటికీ.. ఇంకా రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పనిచేస్తున్నారు.. అయితే కొన్ని సందర్భాలలో ఉద్యోగాలలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. అన్నింటికీ మించి కంపెనీల సీఈవోలు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది..
కరోనా తర్వాత ఆఫీస్ కు వెళ్లి పని చేయడం దాదాపుగా తగ్గిపోయింది. చాలామంది ఉద్యోగులు తమ గృహాల నుంచే పనిచేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే వర్క్ ఫ్రం ఆఫీస్ అనే విధానాన్ని పాటిస్తున్నాయి.. అయితే ఇప్పటికి కూడా మెజారిటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్ అనే విధానానికి ఆసక్తిని చూపించడం లేదు.. ఇలాంటి నేపథ్యంలో ఓ కంపెనీ సీఈవో విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు.. వారంలో ఐదు రోజులపాటు ఆఫీసుకు కచ్చితంగా రావాల్సిందేనని ఉద్యోగులకు స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయం తీసుకున్న సీఈవోకు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. పారమౌంటు, స్కై డాన్స్ అనే మీడియా సంస్థలు విలీనమయ్యాయి.. ఉమ్మడి సంస్థకు సీఈవోగా డేవిడ్ ఎల్లి సన్ వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారానికి ఐదు రోజులపాటు ఆఫీసు కు రావాలని డేవిడ్ ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో స్వచ్ఛందంగా సంస్థ నుంచి వెళ్ళిపోవాలని పేర్కొన్నారు. దీంతో వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయి హోదాలో ఉన్న ఉద్యోగులు 600 మంది స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోయారు.. ఇలాంటి దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకునే సంస్థలో పనిచేయబోమని స్పష్టం చేశారు. దీంతో ఆ సంస్థలో ప్రస్తుతం పని సంక్షోభం ఏర్పడింది. దీనిపట్ల మేనేజ్మెంట్ తీవ్రస్థాయిలో ఆగ్రహం గా ఉంది.. ఈ ఉపద్రవాన్ని మేనేజ్మెంట్ ఎలా చల్లార్చుతుందో చూడాల్సి ఉంటుంది.