Haircut Phobia: సమాజానికి అనుగుణంగా, మన పరిసరాలను అలవాటు చేసుకుని జీవనం సాగిస్తేనే మనకంటూ గుర్తింపు గౌరవం ఉంటాయి. లౌకిక భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే మనం నడుచుకోవాలి. కాదంటే వింతగా చూస్తారు. మనకు నచ్చినట్లు ఉంటాంటమంటే పిచ్చోడు అని ముద్ర వేస్తారు. ఇక స్కూల్‌కు వెళ్తున్న పిల్లలు వారి స్కూల్ పరిసరాలకు అనుగుణంగా ఉండాలి. క్రమశిక్షణ పాటించాలి. స్కూల్ రూల్స్ పాటించాలి. ఇక్కడో బాలుడు స్కూల్ రూల్స్ పట్టించుకోవడం లేదు. అవసరమైతే స్కూల్ మానేస్తాను కానీ, రూల్స్ పాటించనంటున్నాడు. ఇంతకీ ఎవరా బాలుడు.. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుందాం.
జుట్టు పెంచేస్తున్నాడు..
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ చిన్నారి కథ వైరల్ అవుతోంది. ఇందులో పిల్లాడి జుట్ట చాలా పొడవుగా ఉంది. అతడి అవతారం కారణంగా పాఠశాల యాజమాన్యం డిసిప్లేన్ పాడవుతుందని స్కూల్ నుంచి బహిష్కరించింది. బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తల్లిదండ్రులు చెప్పినా స్కూల్ యజమాన్యం దీనిని పట్టించుకోలేదు. జుట్టు పెంచడాన్ని వ్యాధిగా అంగీకరించలేదు. ఆ విద్యార్థి వయసు 12 ఏళ్లు. అతని పేరు ఫరూక్ జేమ్స్. అతను అమ్మాయిలా జుట్ట పెంచేశాడు. జుట్టే ఇప్పుడు అతనికి సమస్యగా మారింది. ఈ జుట్టు కారణంగా స్కూల్ యాజమాన్యం అతడిని తరగతిలోకి రానివ్వడం లేదు.
జుట్టు కత్తిరించుకోడు..
అయితే బాలుడు చిన్న పిల్లాడే కదా.. తల్లిదండ్రులు నయానో భయానో జుట్టు కత్తిరించవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ దీని వెనుక ఓ పెద్ద కారణం ఉంది. జుట్టు కట్ చేసుకోవడం అంటే ఫరూక్‌కు పట్టలేని భయం. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఫరూక్ టాన్సురేఫోబియాతో బాధపడుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే అతను జుట్ట కత్తిరించుకోవడానికి భయపడుతున్నాడని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ సమస్యను అర్థం చేసుకున్నారు. కానీ, స్కూల్ యాజమాన్యం, తరగతి గదిలోని మిగతా పిల్లల తల్లిదండ్రులు దీనిని అర్థం చేసుకోవడం లేదు. దీంతో అతను స్కూల్ మానేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.