https://oktelugu.com/

Bonala Jatra : టాక్ ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను చూసి తీరాల్సిందే

ఇక వేడుకల్లో భాగంగా ప్రముఖ నృత్యకారిణి, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గ్రహీత, రాగుసుధా వింజమూరి చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్‌ స్పాన్సర్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ టీం జ్ఞాపికలతో ప్రశంసించారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 11:29 AM IST

    Bonala Jatra in London

    Follow us on

    Bonala Jatra : ఆషాఢ మాసం సందర్భంగా లండన్‌లోనూ బోనాల జాతర నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్డమ్‌(టాక్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు యూకే నలు మూలల నుంచి సుమారు 1000 తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి. స్వదేశం, స్వరాష్ట్రంలో వేడుకలు జరుపుకుంటున్నట్లుగానే లండన్‌లోనూ సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పోతురాజుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లండన్‌కి ఉన్నత చదువుల కోసం వెళ్లిన ప్రవాస తెలంగాణ విద్యార్థి అక్షయ్‌ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషధారణలో తెలంగాణ సంస్కృతి క ఓసం బోనాల ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. వేడుకలకు సరికొత్త శోభ తెచ్చాడు. పోతురాజు విన్యాసాన్ని ప్రవాసులే కాక అతిథులు ససైతం ప్రశంసించారు.

    ముఖ్య అతిథిగా హౌంస్లౌ డిప్యూటీ మేయర్‌..
    ఇక టాక్‌ అధ్యక్షుడు రత్నాకర్‌ కడుదుల, ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్‌ ముహమ్మద్‌ షకీల్‌ అక్రమ్‌ హాజరయ్యారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల వ్యవహరించారు. హౌంస్లౌ డిప్యూటీ మేయర్‌ ముహమ్మద్‌ షకీల్‌ అక్రమ్‌ మాట్లాడుతూ యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారన్నారు. వీరి స్ఫూర్తి చాలా గొప్పదని ప్రశంసించారు విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెబుతున్న తీరు చాలా గొప్పగా ఉందని పేర్కొన్నారు. టాక్‌ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎలాంటి సాయం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారు. లండన్‌ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, ఐకమత్యంగా ఉండి పరస్పరం సంప్రదాయాలను సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.

    సంస్కృతిని గొప్పగా..
    ఇక స్థానిక కౌన్సిలర్లు అజమీర్‌ గ్రేవాల్, ప్రనీతమ్‌ గ్రేవాల్, ఆదేశ్‌ ఫర్మాహాన్, బంధన చోప్రా కూడా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సండుగ బోనాల వేడుకలను ఎంతో గొప్పగా నిర్వహించారని తెలిపారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు బోనం ఎత్తుకుని లండన్‌ వీధుల్లో ర్యాలీగా రావడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికీ తెలిసేలా టాక్‌ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరినీ ప్రత్యేకంగా సత్కరించి బహుమతలు అందించారు. కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకుని రాబోయే తరాలకు తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.

    అందరూ భాగస్వాములు కావాలి..
    ఇక టాక్‌ అధ్యక్షుడు రత్నాకర్‌ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్‌ సంస్థ తెలంగాణ ప్రజల కోసం ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. అందరూ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఒకపక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న వారు పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ బాధ్యతగా తెలంగాణ బిడ్డలుగా నాడు ఉద్యమంలో నేడు పునర్నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర ఎందరికో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

    ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
    ఇక వేడుకల్లో భాగంగా ప్రముఖ నృత్యకారిణి, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గ్రహీత, రాగుసుధా వింజమూరి చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్‌ స్పాన్సర్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ టీం జ్ఞాపికలతో ప్రశంసించారు.

    కార్యక్రమంలో టాక్‌ అధ్యక్షుడు రత్నాకర్‌ కడుదుల, అవోక్‌ దూసరి, శుష్ముణరెడ్డి, సత్య చిలుముల, మట్లారెడ్డి, వెంకట్‌రెడ్డి, సురేశ్‌ బుడగం, జాహ్నవి వేముల, రవి రేతినేని, రవి ప్రదీప్‌ పులుసు, రాకేశ్‌ పటేల్, సత్యపాల్, మల్లారెడ్డి, గణేవ్‌ కుప్పాల, సత్యం కంది, శ్రీకాంత్‌ జెల్ల, శ్రీధర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, శైలజ జెల్ల, స్నేహ, శ్వేత మహేందర్, స్వాతి, క్రాంతి, పవిత్ర, సుప్రజ, శ్వేత, శ్రీవిద్య, నీలిమ, పృథ్వీ, మణితేజ, గణేశ్‌ పాస్తం, నిఖిల్‌రెడ్డి, హరిగౌడ్, నవీన్‌రెడ్డి, కార్తీక్, రంజిత్, రాజేశ్‌ వాక, మమేందర్, వంవీ, ఆనంద్, అక్షయ్, పావని, జస్వంత్, శివ వెన్న, నాగ్, మాడి, వినోద్, సన్నీ, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.