https://oktelugu.com/

YS Jagan : జగన్ బెంగళూరు సడన్ టూర్.. రెండు వారాల వ్యవధిలో రెండోసారి! అసలేంటి కథ.. ఏం జరుగుతోంది?*

అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరు వెళ్లారు జగన్. వారం రోజులు పాటు అక్కడే సేదదీరారు. ఆయనకు బెంగళూరులో యలహంక ప్యాలెస్ ఉంది. ఇంద్ర భవనం మాదిరిగా ఉంటుంది. జగన్ అక్కడ ముచ్చటపడి మరి కట్టుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల సమయంలో యలహంక ప్యాలెస్ ప్రస్తావన ఉంది. అయితే ఇప్పుడు అధికారం దూరమైన తర్వాత జగన్ బెంగళూరు బాట పట్టడం చర్చకు దారితీస్తోంది

Written By:
  • Dharma
  • , Updated On : July 15, 2024 / 11:23 AM IST
    Follow us on

    YS Jagan :  బెంగళూరుతో జగన్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. రాయలసీమకు దగ్గరగా కర్ణాటక ఉంటుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు  జగన్ ఎక్కువగా బెంగళూరులోని గడిపేవారు. తండ్రి సీఎం అయిన తర్వాతనే హైదరాబాదులో అడుగుపెట్టారు. వ్యాపారాల విస్తరణ చేసుకున్నారు. సాక్షి సంస్థలను ఏర్పాటు చేసి మరింత ప్రాచుర్యం పొందారు. అంతవరకు జగన్ అడ్డా  బెంగళూరే. అయితే ఇప్పుడు అధికారానికి దూరమైన తర్వాత తరచూ బెంగళూరు వెళుతుండడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ మనుగడ కోసమే ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరు వెళ్లారు జగన్. వారం రోజులు పాటు అక్కడే సేదదీరారు. ఆయనకు బెంగళూరులో యలహంక ప్యాలెస్ ఉంది. ఇంద్ర భవనం మాదిరిగా ఉంటుంది. జగన్ అక్కడ ముచ్చటపడి మరి కట్టుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల సమయంలో యలహంక ప్యాలెస్ ప్రస్తావన ఉంది. అయితే ఇప్పుడు అధికారం దూరమైన తర్వాత జగన్ బెంగళూరు బాట పట్టడం చర్చకు దారితీస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన బెంగళూరు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో ఇప్పుడు రెండోసారి బెంగళూరు వెళ్తున్నారు. జూన్ 24న బెంగళూరు వెళ్లిన ఆయన.. జూలై 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. ఇప్పుడు మళ్లీ వెళ్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ఈ వరుస టూర్లపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.

    వాస్తవానికి జగన్ ప్రజా దర్బారు నిర్వహించాల్సి ఉంది. మొదట సోమవారం నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దీనిని నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను కలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని భావించారు. కానీ సడన్ గా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని మరి  బెంగళూరు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ ను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకున్న వేళ ఆయన బెంగళూరు వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బిగ్ డిబేట్ కు దారితీస్తోంది.

    కేవలం తల్లికి వందనం పథకం అమల్లో ఉన్న అనుమానాలను వైసిపి ప్రశ్నించింది. దీనికి షర్మిల కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ తోక పార్టీగా అభివర్ణించడాన్ని కూడా షర్మిల తప్పు పట్టారు. వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో అమ్మ ఒడి పథకానికి కోత పెట్టలేదా అని ప్రశ్నించారు. తనతోనే అమ్మ ఒడి ప్రకటన చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడే కాదు మున్ముందు వైసీపీని టార్గెట్ చేస్తామని ఆమె హెచ్చరించారు. ఒకవైపు కూటమి పార్టీలు దూకుడుగా ఉండగా.. మరోవైపు కాంగ్రెస్ టార్గెట్ చేసుకోవడాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారు. కేవలం షర్మిలను కట్టడి చేసేందుకే బెంగళూరు వెళ్లారని టాక్ నడుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను ప్రయోగిస్తారని.. ఆయనను కలిసేందుకే బెంగళూరు వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.

    మరోవైపు ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వారం రోజులపాటు జగన్ బెంగళూరులోనే ఉండనున్నారు. అటు నుంచి వచ్చి శాసనసభ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. శాసనసభ సమావేశాల వేళ జగన్ మాత్రం బెంగళూరులో ఉంటే విమర్శలు చెలరేగడం ఖాయం. రాష్ట్రానికి తిరిగి వస్తారని.. శాసనసభ సమావేశాలకు మాత్రం వెళ్లరని వైసీపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మొత్తానికి అయితే జగన్ వ్యవహార శైలి చూస్తుంటే భిన్నంగా కనిపిస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.