Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. అమెరికాను ఆర్థికంగా బతోపేతం చేయడంతోపాటు, అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. 37 వేల మందిని నెల రోజుల్లో వారి దేశాలకు పంపించారు. మరోవైపు ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సుమారు లక్ష మందికిపైగా భారతీయులు అమెరికా బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. డిపెండెంట్ వీసాతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లగా.. వీరి వయసు 21 ఏళ్లు నిండటమే తాజా ఆందోళనకు కారణం. హెచ్1బీ వీసాదారుల పిల్లలు డిపెండెంట్ (ఏ–4) వీసా కింద అమెరికాకు వెళ్లవచ్చు. మైనర్‌గా వెళ్లిన వీరికి 21 ఏళ్లు నిండే వరకు ఈ వీసా పనిచేస్తుంది. అనంతరం కొత్త వీసా పునరుద్ధరణకు రెండేళ్ల గడువు ఉంటుంది. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగింపు దశకు చేరుకున్న భారతీయ చిన్నారుల సంఖ్య దాదాపు 1.34 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. వీసా గడువు ముగిసే వారు ఎఫ్–1 (Student visa) వీసా పొందే అవకాశం ఉంది. అయినా ఇది అంత సులభం కాదు. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదైతే స్కాలర్షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతామనే ఆందోళన వారిలో నెలకొంది.
నిబంధనల సడలింపు..
అయితే, వీసా పునరుద్ధరణకు ఉన్న రెండేళ్ల సడలింపు నిబంధనపై న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తాజా ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇప్పటివరకు డిపెండెంట్ చిన్నారులు సహా సరైన పత్రాలు లేని వలసదారులకు డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) నిబంధన రక్షణగా ఉండేది. అయితే.. ఇది చట్ట విరుద్ధమని, దీని కింద వర్క్ పర్మిట్ పొందలేరని టెక్సాస్లోని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ నిబంధన లేకుంటే ఎంతో మంది భారతీయ పిల్లలు (Dependent visa) భవిష్యత్తుపై ప్రభావం పడుతుందనే ఆందోళన మొదలైంది. దీనికితోడు వీరి తల్లిదండ్రులు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా.. నిరీక్షణ సమయం అనేక సంవత్సరాలు ఉండటం మరో సమస్యగా మారింది.