Australia : ప్రేమ ముసుగులో ఇటీవల ఉన్మాద చర్యలు పెరుగుతున్నాయి. తన ప్రేమను ఒప్పుకోలేదని ఒకరు.. తనను దూరం పెడుతోందని మరికొందరు..ఇతరులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానిస్తూ మరొకరు.. ఇలా ప్రేమోన్మాదులు నేరాలకు తెగబడుతున్నారు. క్షణికావేశంతో ప్రేమించిన వారిని మట్టుబెడుతున్నారు. ఆస్ట్రేలియాలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. తనను దూరం పెడుతుందని కక్ష కట్టిన యువకుడు ప్రేమించిన యువతిని సజీవ సమాధి చేశాడు. మృతురాలు, నిందితుడు.. ఇద్దరూ భారతీయులే కావడం గమనార్హం.
భారత్ కు చెందిన జాస్మిన్ కౌర్ అనే యువతి ఆస్ట్రేలియాలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. 2021 మార్చిలో ఆమె అదృశ్యమైంది. దీంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో విచారణ ప్రారంభించిన ఆస్ట్రేలియన్ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆమెను హత్యచేసినట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను హత్య చేసింది ప్రేమించిన వ్యక్తి తారిక్ జోత్ సింగ్ అని తేలింది. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయనకు జీవిత ఖైదు పడే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియన్ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే జాస్మిన్ కౌర్ చంపిన తీరు మాత్రం సైకో కిల్లర్ తీరుగా ఉంది. కౌర్ ను చూసినప్పటి నుంచి తారిక్ వెంటపడ్డాడు. ప్రేమించానని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె అతడ్ని దూరం పెట్టింది. దీనిని తట్టుకోలేని ఆయన 2021 మార్చిలో జాస్మిన్ కౌర్ ను కిడ్నాప్ చేశాడు. నాలుగు గంటల పాటు కారులోనే బంధించాడు. ఆమె ప్రేమించేందుకు ఒప్పుకోకపోయేసరికి ఫ్లిండర్స్ రేంజ్స్ అనే నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లాడు. కళ్లకు గంతలు కట్టాడు. కాళ్లూ, చేతులను వైర్లతో కట్టేశాడు. అమానుషంగా సజీవ సమాధి చేశాడు. అయితే కుమార్తె మృతిపై న్యాయపోరాటం చేస్తున్న తల్లి, కుటుంబసభ్యులు మాత్రం ఆమెను సజీవ సమాధి చేసిన చోటే ప్రార్థనలు చేశారు. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష చాలదని..అంతకు మించి శిక్ష విధించాలని కోరుతున్నారు.