America: అగ్రరాజ్యాం అమెరికాలో భారతీయుల వరస మరణాలు ఆగడం లేదు. కారణం ఏదైనా వారినికి ఒకరు చనిపోతున్నారు. తాజాగా సిక్కులకు సంబంధించిన ఓ కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్‌సింగ్ అలియాస్ గోల్డీ(23) హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు రాజ్‌సింగ్‌ను తుపాకీతో చంపేశారు. కీర్తన కార్యక్రమంలో పాల్గొని గురుద్వారా బయటకి వస్తుండగా కాల్పులు జరిపారు. దీంతో రాజ్‌సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
యూపీ వాసి..
రాజ్‌సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని టండా సాహువాలా గ్రామం. ఐదేళ్ల క్రితమే రాజ్‌సింగ్ తండ్రి మరణించాడు. కుటుంబానికి రాజ్‌సింగే ఆధారం. మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబానికి అండగా ఉంటున్నారు. కానీ అనుకోకుండా హత్యకు గురికావడంతో టండా సాహువాలా గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తీసుకురావాలని అతడి కుటుంబం కేంద్రాన్ని కోరింది.
వరుస మరణాలు..
అమెరికాలో ఇటీవలి కాలంలో భారత్, భారత సంతతికి చెందినవారు వరుసగా చనిపోతున్నారు. గడిచిన రెండు మూడు నెలల్లో మరణించినవారిలో విద్యార్థులతోపాటు వ్యాపారులు కూడా ఉన్నారు. వరుస మరణాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. మరణాల వెనుక ప్రత్యేక కుట్ర లేదని అమెరికా స్పష్టం చేసింది. అయినా అమెరికాలో హత్యలు, మరణాలు ఆగకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.