UK Visa: వాపారం పేరుతో వివిధ దేశాలను ఆక్రమించి వందల ఏళ్లు పాలించిన బ్రిటన్ ఇప్పుడు వలసలతో ఇబ్బంది పడుతోంది. ఆ దేశానికి వస్తున్న వలసలను నియంత్రించేందుకు బ్రిటన్ ఇటీవల వీసా ఆంక్షలు విధించింది. దీని ప్రభావం అక్కడి విద్యాసంస్థలపై పడింది. వీసా ఆంక్షలు బ్రిటన్‌కే ప్రమాదకరమని కాన్ టాబ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడు ఇవాన్ కర్క్ అభిప్రాయపడ్డారు. శాస్త్ర సాంకేతికరంగాల్లో అగ్రగామిగా నిలవాలన్న బ్రిటన్ లక్ష్యానికి వీసా ఆంక్షలు గొడ్డలి పెట్టని ఆయన వ్యాఖ్యానించారు.
వలసలకు అడ్డు కట్ట వేయాలని..
బ్రిటన్‌లో వలసలు పెరుగుతున్నాయి. దీంతో స్థానిక యువతకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు తగ్గుతున్నాయి. దీంతో వలసలను అడ్డుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. గతేడాది వలసలు రికార్డు స్థాయిలో 7,45,000లకు చేరాయి. దీంతో స్థానికంగా వలసలకు అడ్డువేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో వలసల కట్టడికి ప్రధాని రిషి సునాక్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం వలసల నియంత్రణకు ఆంక్షలు విధించింది.
విద్యా సంస్థలపై ప్రభావం..
ఇదిలా ఉండగా వీసా ఆంక్షలతో బ్రిటన్‌లోని విద్యా సంస్థలపై ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థుల రాక తగ్గితే దాని ప్రభావంతో యూనివర్సిటీల ఆదాయం తగ్గుతుందని హెచ్చరించారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో బ్రిటన్ అగ్రగామిగా నిలవాలంటే మానవ వనరులు అవసరమని పేర్కొంటున్నారు. నిపుణులంతా దేశీయంగా లభించరని సూచిస్తున్నారు. బ్రిటన్ లక్ష్యాలు నెరవేరాలంటే విదేశీ నిపుణులు కూడా రావాలని అభిప్రాయపడుతున్నారు.