Haresh Jogani: భారత దేశానికి చెందిన ఓ వ్యాపార దిగ్గజ కుటుంబంలో రెండు దశాబ్దాలుగా నెలకొన్న ఆస్తి వివాదం కేసులో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టు షాకింగ్ తీర్పు చెప్పింది. నలుగురు తోబుట్టువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బడా వ్యాపారి హరేశ్ జోగాని తన నలుగురు సోదరులకు రూ.20 వేల కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
గొడవ ఏంటంటే..
గుజరాత్‌కు చెందిన జోగాని కుటుంబం అమెరికాలో స్థిరపడింది. బిజినెస్ టైకూన్ హరేశ్ జోగానిపై అతని సోదరులు శశికాంత్, రాజేశ్, చేతన్, శైలేష్ జోగానీ మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సుదీర్ఘ భాగస్వామ్యాన్ని హరేశ్ ఉల్లంఘించాడని ఆరోపిస్తూ నలుగురు సోదరులు కోర్టును ఆశ్రయించారు. ఐదు నెలల విచారణ తర్వాత 7 బిలియన్ డాలర్ల విలువైన తీర్పు ఇచ్చింది. సోదరులకు హరేశ్ 2.5 బిలియన్ డాలర్ల(రూ.20 వేల కోట్ల) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వందల కోట్ల విలువైన 17 వేల అపార్ట్‌మెంట్‌లతో కూడిన దక్షిణ కాలిఫోర్నియాలోని రియల్ ఎస్టేట్ ఆస్తి వాటాల ప్రకారం విభజించాలని ఆదేశించింది.
వజ్రాల వ్యాపారంలో జోగాని కుటుంబం..
గుజరాత్‌కు చెందిన జోగాని కుటుంబం ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ఉత్తర అమెరికాలో వజ్రాల వ్యాపారంలో రాణించింది. శశికాంత్ జోగాని 1969లో (అతనికి 22 ఏళ్ల వయసులో) కాలిఫోర్నియా వెళ్లాడు. సొంతంగా రత్నాల వ్యాపారంలో సోలో సంస్థ ప్రారంబించాడు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. బాగా సక్సెస్ కావడంతో వ్యాపారం విస్తరించాడు. ఈ క్రమంలో 1990 ప్రారంభంలో మాంద్యం కారణంగా నష్టపోయాడు. 1994లో నార్త్ రిడ్జ్ భూకంపం కారణంగా ఒక భవనంలోని 16 మంది చనిపోయారు. ఈ క్రమంలో శశికాంత్ తన సోదరులను వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకున్నాడు. రియల్ ఎస్టేట్‌లో భాగంగా 17 వేల అపార్ట్‌మెంట్ యూనిట్లు నిర్మించారు. దీని తర్వాత వివాదం మొదలైంది.
భాగస్వాముల తొలగింపు..
హరేశ్ మేనేజ్‌మెంట్ నుంచి తనను బలవంతంగా తొలగించి తమకు రావాల్సిన దానిని అడ్డుకున్నాడని 2003లో శశికాంత్ జోగాని ఫిర్యాదు చేశాడు. అయితే రాతపూర్వకంగా భాగస్వామ్యం లేదని హరేశ్ క ఓరుటలో వాదించాడు. విచారణ తర్వాత మౌఖిక ఒప్పందాన్ని హరేశ్ ఉల్లంఘించాడని కోర్టు గుర్తించింది. రియల్ ఎస్టేట్ సంస్థలో శశికాంత్(72) 50 శాతం, హరేశ్ 24 శాతం, రాజేశ్ 10 శాతం, శైలేష్ 9.5 శాతం, చేతన్ 6.5 శాతం వాటాలు ఉన్నట్టు జ్యూరీ నిర్ధారించింది. వారికి రూ.20 వేల కోట్ల పరిహారం చెల్లించడంతోపాటు స్థిరాస్తిని విభజించాలని సూచించింది.