Telugu NRI In America: గ్రీన్ కార్డ్… విదేశాల్లో శాశ్వత నివాస కార్డులివి. వీటిని పొందేందుకు ప్రవాస భారతీయులు చాలా వ్యయప్రయాసులకు గురవుతుంటారు. ఇవి పొందాలంటే చాలా రకమైన కఠిన నిబంధనలు ఉంటాయి. అటువంటిది సులభంగా గ్రీన్ కార్డులు మంజూరు ప్రక్రియను ప్రారంభించారు.. అమెరికాలో కన్సల్టెన్సీలు నడుపుతున్న కొందరు తెలుగు వాళ్ళు. అమెరికాలో ఉంటూ ఆ దేశం యొక్క శాశ్వత నివాస కార్డుల నకిలీలను సృష్టించారు. అగ్ర దేశం లో అతి పెద్ద స్కాంకు తెరలేపారు మనవాళ్లు.
అమెరికాలో తెలుగు వాళ్ళ కన్సల్టింగ్ కంపెనీలు కొన్ని ఫేక్ గ్రీన్ కార్డులే కాకుండా… ఫేక్ హెచ్ వన్ బి వీసాల ని, ఫేక్ ఐ 797 లను.. ఓ పి టి విద్యార్థుల కోసం తయారు చేసి ఇస్తున్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని కొందరు విద్యార్థులు ఉద్యోగాలను పొందేలా చేస్తున్నాయి. దీనికిగాను సదరు విద్యార్థి జీతంలో భారీ పర్సంటేజీలను ఈ కన్సల్టెన్సీలు తీసుకుంటున్నాయి.
అయితే బాధిత విద్యార్థుల జాబితాలో తెలుగు వారు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతిభ లేకపోయినా మంచి ఉద్యోగం పట్టేయడం, డాలర్లు సంపాదించాలని యావలో పడి ప్రాక్సీ ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం… వర్క్ ఫ్రం హోం పేరిట రెండు,మూడు ఉద్యోగాలు చేయడం వంటివి చేస్తున్నారు. అమెరికాలో ఇవి అత్యంత నేరపూరితమైనవి. స్టూడెంట్ వీసా పై అమెరికాలో ల్యాండ్ అయిన తెలుగు విద్యార్థులపై తెలుగు కన్సల్టెన్సీలు వలవిసురుతున్నాయి. డాలర్ల ఆశ చూపి నేరంలోకి దించుతున్నాయి.
అయితే ఇందులో అమెరికన్ యూనివర్సిటీలు సైతం తప్పిదాలకు పాల్పడుతుండడం విశేషం. డబ్బు కోసం ఎంతటి చర్యకైనా దిగుతున్నాయి. తెలుగు కన్సల్టెన్సీల ఫేక్ చర్యతో పాటు యూనివర్సిటీల తప్పిదాలపై అమెరికన్ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ కు దిగితే వందలాదిమంది విద్యార్థులు మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది. అందులో తెలుగు వారే అధికంగా ఉంటారనడం అతిశయోక్తి కాదు. దీనిపై అమెరికాలో భారత రాయబారి కార్యాలయం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకుంటే చాలామంది భవిష్యత్తులు ప్రమాదంలో పడినట్టే.