TANA : అట్లాంటా నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “తానా పాఠశాల” 2025–26 విద్యా సంవత్సరాన్ని ఆత్మీయ వాతావరణంలో ప్రారంభించింది. “పలక బలపం” పేరుతో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో గురువుల పరిచయాలు, తల్లిదండ్రులు–విద్యార్థుల మధ్య సంభాషణలు ఆకట్టుకున్నాయి.

తెలుగు భాష, సంస్కృతిని అమెరికాలో పెరిగిపోతున్న తెలుగు తరం పిల్లలకు నేర్పించాలన్న లక్ష్యంతో తానా ఈ పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లల అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు డిజిటల్ రైటింగ్ బోర్డులు బహుమతులుగా అందజేశారు. చివరగా తెలుగు ఆటలతో కార్యక్రమం ఉత్సాహంగా ముగిసింది.

ఈ వేడుకను పాఠశాల ప్రాంతీయ ప్రతినిధి సునీల్ దేవరపల్లి, తానా ప్రాంతీయ ప్రతినిధి శేఖర్ కొల్లు సమన్వయంతో నిర్వహించారు. అట్లాంటా పాఠశాల టీచర్ వాణి పల్నాటి సేవలను నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమానికి తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి హాజరై, విద్యార్థులను ఉత్సాహపరిచారు. అనంతరం వాణి గారిని శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి, బోర్డు డైరెక్టర్ భరత్ మద్దినేని, ఫౌండేషన్ ట్రస్టీ మధుకర్ యార్లగడ్డ, మహిళా సేవల సమన్వయకర్త సోహ్నీ అయినాలా, సోషియల్ వెల్ఫేర్ కో ఆర్డినేటర్ సునీల్ దేవరపల్లి, తానా ప్రాంతీయ ప్రతినిధి (సౌత్ ఈస్ట్) శేఖర్ కొల్లు, అట్లాంటా టీచర్లు అర్థిక అన్నే, పూలాని జాస్తి, వాణి పల్నాటి, రాజేష్ జంపాల, అనిల్ యలమంచిలి, ఉప్పు శ్రీనివాస్, మురళి బొడ్డు, మాలతి నాగభైరవ, వినయ్ మద్దినేని, కోటేశ్వరరావు కందిమళ్ల, నరేన్ నల్లూరి, యశ్వంత్ జొన్నలగడ్డ, సునీత పొట్నూరు, సురేష్ బండారు, కృష్ణ ఇనపకుతిక తదితరులు పాల్గొన్నారు.

తానా ప్రతినిధులు మాట్లాడుతూ “అమెరికాలోని తెలుగు చిన్నారులు తమ మాతృభాష పట్ల ప్రేమను పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ పాఠశాల తెలుగు భాషను, సంస్కృతిని తరతరాలకు అందించడంలో మైలురాయిగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ “పలక బలపం” కార్యక్రమం కొత్త విద్యా సంవత్సరానికి శుభారంభంగా నిలిచి, తల్లిదండ్రులు–విద్యార్థులు ఆనందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

