Gautam Gambhir: అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కోసం భారత అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత జట్టులోకి ప్రవేశించడం.. జట్టు కోసం ఆడుతుండడమే ఇందుకు కారణం. కేవలం భారత అభిమానులు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా రోహిత్, విరాట్ కోహ్లీ ఆట తీరును చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరూ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా ఈసారి గెలుచుకుంది.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లండన్ లో ఉంటున్నాడు. గడచిన నాలుగు నెలలుగా అతడు అక్కడే ఉంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కోసం అతడు ఇండియాలో అడుగు పెట్టాడు. జట్టుతో కలిసి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిపోతున్నాడు. ఇక రోహిత్ శర్మ కూడా కుటుంబంతో కలిసి ముంబైలోనే ఉంటున్నాడు. బిసిసిఐ పెద్దల సూచనల మేరకు అతడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అత్యంత కఠినమైన ఆహార నిబంధనలు పాటిస్తూ తన బరువును చాలా వరకు తగ్గించుకున్నాడు. మైదానంలో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇటీవల ప్రాక్టీస్ లో భాగంగా అతడు కొట్టిన బంతి అమాంతం పైకి లేచింది. అంతేకాదు రోహిత్ శర్మ కారు అద్దాలను బద్దలు కొట్టింది. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం బీసీసీఐ పెద్దలు సూచించిన విధంగా ప్రాక్టీస్ మాత్రం చేయడం లేదు. అయినప్పటికీ అతనికి జట్టులో చోటు కల్పించారు.
రోహిత్, విరాట్ కోహ్లీ జట్టులో ఆడబోతున్నారని సంతోషం అభిమానులను నేల మీద ఉండనీయడం లేదు. ఎందుకంటే వారిద్దరి ఆట చూడాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అభిమానుల ఆశల మీద టీమ్ ఇండియా క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ నీళ్లు చల్లాడు. ఎందుకంటే 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ కోహ్లీ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ప్రశ్న టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎదురయింది. ఆ ప్రశ్నకు అతడు నేరుగా సమాధానం చెప్పాడు. ” 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ ఆడతారని నేను నమ్మకం ఇవ్వలేను. ఎందుకంటే జట్టులో స్థానం నేను డిసైడ్ చేయలేను. ఆటగాళ్ల ఆట తీరు మాత్రమే డిసైడ్ చేయగలుగుతుంది. అలాంటప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ లో వారిద్దరు ఆడతారనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ రోహిత్, విరాట్ ఆటను నేను ఆస్వాదిస్తుంటాను. వారిద్దరూ టీమిండియా తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. చాలా మ్యాచ్లలో గెలిపించి చూపించారని” గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.
గౌతమ్ గంభీర్ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీ పోవడానికి ప్రధాన కారణం గౌతం గంభీర్ అని చర్చ జరుగుతుంది. దీనికి తోడు వచ్చే వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ ఆడేది అనుమానమేనని గంభీర్ సంకేతాలు ఇవ్వడంతో.. అతనిపై అభిమానులు మండిపడుతున్నారు. లెజెండరీ ఆటగాళ్ల విషయంలో రాజకీయాలు చేయకూడదని అతడికి సూచిస్తున్నారు.