-తానా ఆధ్వర్యంలో ఘనంగా ‘అమ్మానాన్న సంబరాలు’
TANA ‘Amma Nanna Sambaralu’ : దేశాలు దాటినా మన చరిత్రను, సంస్కృతిని మాత్రం మరిచిపోలేదు ప్రవాస తెలుగువారు. అమెరికాలో ఉన్న మన వారసత్వాన్ని అక్కడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మన పెద్దలు నేర్పిన విలువలకు ప్రాణం పోస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తిపై చేస్తున్న కృషి ఎనలేనిది. విదేశాల్లో నివసిస్తున్న పిల్లలు, యువకులకు తెలుగు భాషపై మక్కువ, పటిష్టత , అభిరుచిని తానా సభ్యులు నేర్పించడంలో కృషి చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా దేశదేశాల్లో నివసిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాలు మన సంస్కృతి ఆయా దేశాల్లోనూ ఇనుమడింపచేస్తున్నారు. తెలుగు ప్రజలు అమెరికాలో ఉన్నా మన కుటుంబ విలువలపట్ల గౌరవం చూపుతున్నారు. ముఖ్యంగా మనల్ని కన్న తల్లి దండ్రుల పట్ల భక్తిని ప్రదర్శిస్తున్నారు. సంప్రదాయపు విలువలు ఆచరించటంలో నిబద్ధత చూపుతున్నారు. భావితరాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
మే నెల 22న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ” అమ్మ నాన్న సంబరాలు” అనే ఆన్ లైన్ సమావేశం అద్భుతంగా సాగింది. తానా అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి గారు ఆన్ లైన్ లో శ్రోతల్ని, మిత్రులని, విశిష్ట అతిథులని ఆహ్వానిస్తూ స్ఫూర్తిదాయకంగా తన అధ్యక్షోపన్యాసం సాగించారు. డాక్టర్ ఉమా ఆరమండ్ల కటికి సారథ్యంలో సభ సందేశాత్మకంగా సాగింది.
ఈ ఆన్ లైన్ సమావేశంలో విశిష్ట అతిథిగా తెలుగు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారు పాల్గొని తమ విలువైన కీలక ఉపన్యాసం ఇచ్చారు. ” అమ్మా నాన్నల’’ త్యాగ నిరతినీ, గొప్పతనాన్నీ కవితాత్మకంగా తన కవితలతో మనసులు కదిలించే విధంగా వివరించారు. మానవత్వపు విలువలు ఆవిష్కరించి అమ్మా నాన్నల దివ్యత్వాన్ని అద్భుతం గా విడమరిచారు.
ప్రముఖ రచయిత్రి , భాషావేత్త, విద్యావేత్త డాక్టర్ శారదాపూర్ణ శొంఠి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు . భారతీయ , తెలుగు సాహిత్యం లో అనేక సంఘటనలు వివరిస్తూ ప్రస్తుత కాలంలో తర్వాతి తరాలకి విలువలు అందించటంలో తల్లి దండ్రులదే అధిక బాధ్యత అన్నారు. యువతరం వ్యక్తిత్వ వికాసంలో ఇటువంటి సమావేశాలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్న తానా సంస్థని, కార్యవర్గాన్నీ అభినందించారు.
తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ ఉమా ఆరమండ్ల కటికి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో విజయ యలమంచిలి, శారద సొంటి, శ్రీనివాస్ కూకట్ల, లావు అంజయ్య చౌదరి, జయ్ తాళ్లూరి, శ్రీరామ్ సొంటి, లోహిత, కళారాణి కాకర్ల పాల్గొన్నారు. ఇక నటులు తనికెళ్ల భరిణి కీలక ఉపన్యాసం చేశారు.