TANA : అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) అట్లాంటా టీమ్ మరో మంచి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కమ్యూనిటీకి నిరంతరం సేవలందిస్తూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధుల్లో నిమగ్నమైన ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ సిబ్బందికి గౌరవం తెలియజేసే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని తానా నాయకులు నిర్వహించారు.

కమ్మింగ్ ప్రాంతంలోని సౌత్ ప్రీసింక్ట్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో షెరీఫ్ సిబ్బందిని సన్మానిస్తూ వారికి ప్రత్యేక విందు భోజనాన్ని తానా టీమ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని షెరీఫ్ కార్యాలయంతో సమన్వయం చేసి, సజావుగా నడిపేందుకు శ్రీరామ్ రాయలు కీలక పాత్ర పోషించగా, ఈవెంట్ నిర్వహణ బాధ్యతలను శేఖర్ కొల్లు తీసుకున్నారు. వారి కృషికి తానా అట్లాంటా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖ తానా నాయకులు, మాజీ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, బోర్డ్ సభ్యుడు శ్రీనివాస్ లావు, మాలతి నాగభైరవ, సోహినీ అయినాల, సునీల్ దేవరపల్లి, శ్రీనివాసులు రామిశెట్టి, మురళి బొడ్డు, శ్రీనివాస్ ఉప్పు, పూలని జాస్తి, మధుకర్ యార్లగడ్డ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో యువ తానా సభ్యుల సానుభూతిపూర్వక భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమితా యార్లగడ్డ, ఆరుషి నాగభైరవ, అవనీష్ లావు వంటి యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం, వారిలోనూ సేవా భావన విస్తరిస్తోందన్న విషయాన్ని చాటిచెప్పింది. యువతను ప్రోత్సహించడంలో తానా ఎప్పుడూ ముందుండడం ఈ కార్యక్రమంలో మరోసారి స్పష్టమైంది.

కమ్యూనిటీతో కలిసిమెలిసి పనిచేసే, సేవకు ప్రతిరూపంగా నిలిచే వ్యక్తులను గుర్తించి గౌరవించడంలో తానా అట్లాంటా టీమ్ చూపిన చొరవ అభినందనీయమని పలువురు వ్యాఖ్యానించారు. ఇది అమెరికాలోని తెలుగు ప్రజల సమాజ సేవా తపనకు మచ్చుతునకగా నిలిచింది.