TANA Conferences In Detroit: ఉత్తర అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా పేరుగాంచిన తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం-TANA) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ద్వైవార్షిక మహాసభలకు ఈసారి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అమెరికా అంతటా విస్తరించిన తెలుగువారి సమూహంతో పాటు, అమెరికా మరియు భారత్‌కు చెందిన రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, ఇతర ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు.
ఈసారి తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జూలై 3 నుండి 5 వరకు మిచిగన్‌లోని డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ వేదికగా నిర్వహించనున్నాయి.

మహాసభల ఏర్పాట్ల కోసం ఏర్పాటుచేసిన వివిధ కమిటీలతో ఇటీవల డిట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఆవరణలో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మహాసభల విజయవంతానికి అవసరమైన ప్రణాళికలు, ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేక సావనీర్ కోసం కమిటీ సభ్యుల ఫోటో సెషన్స్ కూడా నిర్వహించబడ్డాయి.
ఈ సమావేశానికి ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని హాజరవడం అందరికీ ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ, తానా మహాసభల విజయవంతం కోసం తాను తనవంతుగా సహకారం అందించనున్నట్లు తెలిపారు.

ఇక యూత్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, తెలుగు సంస్కృతిని తమ సినిమాల ద్వారా ఆవిష్కరిస్తున్న మైత్రీ మూవీస్‌పై తమకు ఎంతో ఆకర్షణ ఉందని పేర్కొన్నారు. నవీన్ ఎర్నేని రూపొందిస్తున్న సినిమాల విడుదల కార్యక్రమాలను తానా యూత్ కాన్ఫరెన్స్‌లో నిర్వహించాలని వారు కోరారు.
కమిటీ సభ్యుల ఉత్సాహం చూసి సంతృప్తిగా ఉందని కాన్ఫరెన్స్ సమన్వయకర్త ఉదయ్ కుమార్ చాపలమడుగు తెలిపారు. మహాసభలు విజయవంతంగా జరిగేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులుతో పాటు ఇతర తానా నేతలు, మహాసభల నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చేపట్టిన అనేక మంది పాల్గొన్నారు.
ఈ ఏడాది తానా మహాసభలు నూతన జోష్‌తో, విశిష్టతతో, ప్రపంచ తెలుగు సమాజాన్ని ఒకచోట చేర్చే వేడుకగా మారనుంది.