Hong Kong: సత్యనారాయణ వ్రతం చాలా శుభమని, మంచి ఫలితాలను ఇస్తుందని తెలుగురవాళ్ల నమ్మకం. వైశాఖ, మాఘ, కార్తీక మాసాల్లో ఏకాదశి, పౌర్నమి రోజుల్లో సత్యనారాయణస్వామి వ్రతం ఆచరిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడాడ మాఘ మాసం పౌర్ణమి సందర్భంగా హాంగ్‌కాంగ్‌లోని హ్యాపి వ్యాలీ హిందూ టెంపుల్‌లో శనివారం(ఫిబ్రవరి 24న) సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించారు.
భక్తి శ్రద్ధలతో, శాస్త్రోక్తంగా..
సత్యనారాయణస్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో, శాస్త్రోక్తంగా హ్యాపీ వ్యాలీ హిందూ ఆలయంలో ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సమాఖ్య సభ్యులు కుటుంబంతో తరలి వచ్చి ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. పూజలు చేశారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి మాట్లాడుతూ హాంగ్‌కాంగ్‌లో తమలపాకులు, వక్కలు దొరడం కష్టమ, దొరికినా చాలా ఖరీదని తెలిపారు. అయినా ఏటా పూజ కోసం భారత్ నుంచి సభ్యుల ద్వారా తెప్పించుకుంటున్నామని వెల్లడించారు.
పురోహితుల కొరత..
ఇక హాంగ్‌కాంగ్‌లో పురోహితుల కొరత ఉందని జయ తెలిపారు. తమ సభ్యులే ఒకరు పూజ, కథ, విధి విధానం చేయిస్తారని పేర్కొన్నారు. ఈసారి మెరైన్ ఇంజినీర్ శిరాం రాంభట్ల భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ పూజ అందరితో చేయించారని తెలిపారు. తీర్థ ప్రసాదాల స్వీకరణ అనంతరం అందరం సంతోషంగా ఇళ్లకు వెళ్లామని వెల్లడించారు.