Dubai Rains: తీవ్ర ఎండలతో ఎప్పుడూ ఉక్కిరిబక్కిరయ్యే దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కొన్ని రోజులుగా అక్కడి వాతావరణంలో అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత నెల(ఏప్రిల్)లో ఈ ఎడారి దేశాన్ని కుంభవృష్టి వణికించింది. నెల రోజులు తిరగకుండానే మళ్లీ ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
ఒక్కసారిగా మారిన వాతావరణ..
దుబాయ్‌లో బుధవారం రాత్రి నుంచి వాతావరణం మారిపోయింది. దుబాయ్, అబుదాబీసహా పలు నగరాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రయాణికులకు ట్రావెల్ అడ్వయిజరీ..
అంతర్జాతీయ విమానాల రదు‍్ద నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి. ‘దుబాయ్, షారా‍్జ, అబుదాబీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన సేవలకు ఆటంకం కలుగుతోంది.. ఎయిర్‌పోర్టుకు బయల్దేరేముందు మీ విమాన స్టేటస్ చెక్ చేసుకోండి’ అని ఇండిగో వెల్లడించింది. విస్తారా, స్పైస్ జెట్ కూడా ఇలాంటి సూచనలు చేశాయి. మే 5వ తేదీ వరకు విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యే అవకాశముందని తెలిపారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తామని పేర్కొన్నాయి.
ఏప్రిల్‌లో భారీ వర్షాలు..
ఇదిలా ఉంటే గత ఏప్రిల్ 14, 15 తేదీల్లో యూఈఏని భారీ వర్షాలు ముంచెత్తాయి. దుబాయ్ నగరంలో ఏడాదిన్నరలో కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లోనే కురిసింది. 1949 తర్వాత గత నెలలోనే ఇక్కడ రికార్డుస్థాయిలో వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తక్కువే అయినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.