Paadana Telugu Paata – Finals : కెనడాలో ఘనంగా జాతీయ పాటల పోటీ “పాడనా తెలుగుపాట”

కార్యక్రమం ఆసాంతం రసవత్తరంగా సాగి , శ్రోతలను ఆకట్టుకుంది. ప్రతి ఒక్క అభ్యర్థీ ఎంతో చక్కగా పాడిన కారణంగా విజేతల నిర్ణయం చాలా కష్ట సాధ్యమైందని డా. జోశ్యభట్ల అభిప్రాయపడ్డారు. ప్రతి పాటా ఎంతో అద్భుతంగా సాగి, ఆహూతులను అలరించింది .

Written By: NARESH, Updated On : October 19, 2023 9:19 am
Follow us on

Paadana Telugu Paata – Finals 2023 : మొట్టమొదటిసారి కెనడాలో తెలుగుతల్లి కెనడా, ఓంటారియో తెలుగు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పాడనా తెలుగు పాట కెనడా సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. కెనడాలో టొరాంటో నగరంలోని రీజెంట్ థియేటర్ లో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాయవరపు విజయగోపాల రాజు, లక్ష్మి రాయవరపు, మురళి పగిడేల, శివజ్యోతి పగిడేల, శ్రీనివాస్ నారు, పద్మిని నారు జ్యోతి ప్రజ్వలన చేసి దీన్ని ప్రారంభించారు. శ్రీమతి రుక్మిణి మద్దులూరి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు.

మన టీవీ కలలు కళలు కార్యక్రమ నిర్వాహకులు గూడూరు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, ప్రముఖ సంగీత దర్శకులు డా. జోశ్యభట్ల , ప్రముఖ రచయిత్రి, గాయని ఆర్. దమయంతి గార్లు న్యాయనిర్ణేతలుగా 27 మంది తుది అభ్యర్థుల మధ్య పోటీ పది గంటల పాటు విజయవంతంగా సాగింది. కెనడాలో మొదటిసారి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆసాంతం రసవత్తరంగా సాగి , శ్రోతలను ఆకట్టుకుంది. ప్రతి ఒక్క అభ్యర్థీ ఎంతో చక్కగా పాడిన కారణంగా విజేతల నిర్ణయం చాలా కష్ట సాధ్యమైందని డా. జోశ్యభట్ల అభిప్రాయపడ్డారు. ప్రతి పాటా ఎంతో అద్భుతంగా సాగి, ఆహూతులను అలరించింది .

గెట్ హోం రియాల్టీ నుంచి రమేష్ గొల్లు, ఆనంద్ పెరిచెర్ల, రఘు జూలూరిలు విజేతలకి బహుమతులు అందజేసారు. ప్రీ టీన్స్ విభాగంలో వికసిని అలవలపాటి, సాహితీ యలమంచిలి, హేమాన్వి సిరిమండ్ల లకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, టీన్స్ విభాగంలో ఆశ్రిత పొన్నపల్లి, మీనా కూచిమంచి, శ్రేయస్ ఫణి పెండ్యాల ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, అడల్ట్స్ విభాగంలో గాయత్రి తణుకు , రోహిణి చేబియ్యం, మనోభిరాం నెల్లుట్ల లకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. ఇవి కాక ప్రతి విభాగంలోనూ ముగ్గురికి తన సంగీత దర్శత్వంలో పాడే అవకాశం ఇస్తానని జోశ్యభట్ల ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆనందం మిన్ను ముట్టింది. ఇలాంటి కార్యక్రమం కెనడాలో జరగడం వారికి గర్వకారణంగా ఉందని, ఈ కార్యక్రమానికి ముఖ్య ఆర్థిక సహకారం అందించిన గెట్ హోమ్ రియాలిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

వాలంటరీ సేవలు అందించిన శ్రీవాణీ ముప్పళ్ల, ఝాన్సీ లక్ష్మి గరిమెళ్ల, హర్ష దీపిక రాయవరపు, ప్రసాద్ ఘట్టి, ప్రవీణ్ నీలా మొదలైన వారికి, ఆర్థిక సహాయం అందించిన సంస్థలకి, విందు భోజనం ఏర్పాటు చేసిన రామ్ మరియు అమృత జిన్నాల గారికి, ముందు ఆవృతాలకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీమతి వసంతలక్ష్మి అయ్యగారి, శ్రీమతి ఝాన్సీలక్ష్మి రాపర్తి, శ్రీమతి సుభద్ర ప్రభ, శ్రీమతి పారిజాత బర్దిపూర్, శ్రీమతి శశికళ స్వామీ, శ్రీమతి సురేఖ మూర్తి లకు, కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నడిపించిన డా. జోశ్యభట్ల , శ్రీమతి ఆర్ దమయంతి గార్లకు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తం కార్యక్రమాన్ని మన టీవీలో ప్రసారం చేసిన శ్రీ గూడూరు శ్రీనివాస్ గారికి, వీడియో ఎడిటర్ శ్రీ సోడసాని శ్రీనివాస్ గారికి, మీడియా పార్టనర్ శ్రీ స్వామి నారాయణ గారికి, డిజైనింగ్ చేసిన కుశాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అందజేశారు. శ్రీ అనంత శ్రీరామ్ గారు, శ్రీ తాతా బాల కామేశ్వరరావు గారు, శ్రీ ప్రకాశ్ వీరమల్ల గారు, కార్యక్రమానికి రాలేనందున వారి శుభాకాంక్షలు వీడియో రూపంలో తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీ వంశీ రామరాజు గారిని విశ్వ కళా సేవా భూషణ బిరుదుతో సత్కరించారు. శ్రీ రామరాజు గారి కెనడా ప్రయాణం రద్దు అయిన కారణంగా బిరుదు ప్రదానోత్సవం ప్రముఖ విలక్షణ సినీ కథా నాయకుడు, నటుడు శ్రీ చంద్రమోహన్ గారు మరియు శ్రీమతి జలంధర గార్ల చేతుల మీదుగా అత్యద్భుతంగా జరిగింది. ఈ సభలో శ్రీ చంద్రమోహన్ గారు మాట్లాడుతూ శ్రీ వంశీ రామరాజు గారు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవలని కొనియాడారు. కెనడా తెలుగు వారి నించి మొదటి సారి ఇంతటి గొప్ప సన్మానాన్ని అందుకున్న మొదటి వ్యక్తి శ్రీ వంశీ గారు కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలుగుతల్లి కెనడా మరియు ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వంటి సంస్థలు తెలుగు భాషకి, సంస్కృతి, సాంప్రదాయాలకి చేస్తున్న సేవలని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. విదేశాలలో ఉన్న సంస్థలు చేపట్టే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని శ్రీ రామరాజు గారు హర్షం వ్యక్తపరిచారు.

వంశీ రామ రాజు గారికి, తెలుగుతల్లి కెనడా, ఓంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకి ఇండియాలో.. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేసారు.