NRI Woman Viral Video: దూరపు కొండలు నునుపు.. దగ్గరకు వెళ్లేగాని లోతులు ఎత్తులు, వంపులు తెలియవు. అమెరికా పరిస్థితి కూడా అంతే. భారతీయులకు అమెరికా అందగా కనిపిస్తుంది. అకర్షిస్తుంది. కానీ అక్కడికి వెళ్లినవారి కష్టాలు వారు అనుభవంతో చెబితేగానీ తెలియవు. తాజాగా ఓ ఎన్నారై మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అమెరికాలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టేలా వివరించారు. అందరూ బాగున్నామని చెబుతారు కానీ, ఏమీ బాగుండరు అని వెల్లడించింది.
ప్రశాంతత నుంచి నిరాశ వరకు..
అమెరికాలో జీవితం మొదట్లో ప్రశాంతంగా అనిపించినా, క్రమంగా అది ఒంటరితనంగా మారుతుంది. అక్కడ మాట్లాడే వారు లేకపోవడం, ఎవరూ పట్టించుకోకపోవడం వంటి పరిస్థితులు భారతీయులను కలవరపరుస్తాయి. భారతదేశంలో ఎక్కడ చూసినా సందడి, స్నేహితులు, కుటుంబ సమావేశాలు ఉంటాయి, కానీ అమెరికాలో ఇంటి గోడల మధ్య నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. ఇది ముఖ్యంగా కొత్తగా వలస వచ్చినవారికి తీవ్రమైన అనుకూలత సమస్యగా మారుతుంది. సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల, భారతీయులు తమ దేశీయులను కలిసే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు, ఇది వారి రోజువారీ జీవితంలో ఏర్పడిన శూన్యతను సూచిస్తుంది.
ఫోన్ కాల్స్‌తో మానసిక ఉపశమనం..
అమెరికాలో ఉండే భారతీయులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గంటల తరబడి మాట్లాడటం సాధారణం. ఇది కేవలం సమాచార మార్పిడి కాదు, మానసిక ఉపశమనం కోసం చేసే ప్రయత్నం. భారతదేశంలో ఉన్నవారికి ఇది చికాకుగా అనిపించినా, అక్కడి వారికి మాట్లాడటం ఒక అవసరంగా మారుతుంది. సరదాలు, గొడవలు, ముచ్చట్లు లేని జీవితం వారిని మానసికంగా ఒంటరిని చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి అనుభవాలు డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలకు దారితీస్తాయి, ముఖ్యంగా సాంస్కృతిక వ్యత్యాసాలతో ఏర్పడే అనుకూలత లోపాలు ఇందుకు కారణమవుతాయి.
భారతదేశంపై ఆకర్షణ..
అమెరికాలోని జీవితం ఎంత దుర్భరమైనదో తెలుసుకున్న తర్వాత, భారతదేశంపై గౌరవం మరింత పెరుగుతుందని ఎన్నారై మహిళ గర్వంగా వెల్లడించింది. భారతీయులు తమ జన్మభూమిని అందమైనదిగా, సంతోషకరమైనదిగా చూడటం సహజం. అక్కడి సామాజిక సంబంధాలు, సంస్కృతి, సందడి వంటివి అమెరికాలో లేని లోపాన్ని పూర్తి చేస్తాయని తెలిపింది. భారత్‌కు తిరిగి వచ్చేప్పుడు ఎన్నారైల కళ్లలో కనిపించే ఆనందం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. అందుకే భారతీయులుగా మనం గర్వపడాలని వెల్లడించింది.