London: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలుగు మహిళలు దేశ విదేశాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇటీవల అమెరికాలో తెలుగు మహిళలు నిర్వహించాగా తాజాగా లండన్‌లో నిర్వహించారు. తెలుగు లేడీస్ ఇన్ యూకే అనే ఫేస్‌బుక్ గ్రూపు ద్వారా కలుసుకున్న యూకేలోని మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
2011లో ప్రారంభం..
ఈ తెలుగు లేడీస్ యూకే గ్రూపును శ్రీదేవి మీనావల్లి 2011 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఈ టీఎల్‌యూకే గ్రూపులో సుమారు 5 వేల మందికిపైగా తెలుగు మహిళలు ఉన్నారు. బ్రిటన్‌కు వలస వచ్చే తెలుగు ఆడపడుచులందరికీ నూతన పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, విద‍్య, వైద్యం, ఆర్థిక సందేహాలు, సలహాలు ఇవ్వడం ఈ గ్రూపు ఉద్దేశం.
ఏటా కార్యక్రమాలు..
ఇక ఈ తెలుగు లేడీస్ యూకే గ్రూపు ఆధ్వర్యంలో ఏటా వినూత్న కార‍్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సెంట్రల్ లండన్‌లోని థేమ్స్ నదిపై ఒక ప్రైవేటు క్రూయిజ్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. సమారు గంటపాటు నదిపై ప్రయాణం చేస్తూ విందు వినోదాలతోపాటు, ఆటపాటలతో, లైవ్ ఎంటర్టైన్‌మెంట్‌లో అందరూ ఉల్లాసంగా గడిపారు.
గ్రూపుకు చేయూత..
ఇక ఈ గ్రూపులోని సభ్యులు ఆటపాటలతోపాటు రాఫెల్ ద్వారా ఈ గ్రూపు నిర్వహించే విద్య, వైద్య సేవ కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తారు. మహిళలు ఇల్లే కాదు.. సమాజ అభివృద్ధికిక కూడా ఎంతో కీలకమని చాటుతున్నారు. ఈ ఈవెంట్‌లో శ్రీదేవి మీనావల్లితోపాటు సువర్చల, మాదిరెడ్డి, స్వాతి డోలా, జ్యోతి సిరపు, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్పి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.