
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల జోరు కొనసాగుతోంది. యూఎస్ లో నివసిస్తున్న ఇతర దేశాలను వెనక్కు నెట్టి ముందుకు సాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. అమెరికన్లను కూడా తోసి రాజు అంటున్నారు. ఇటీవల అమెరికా విడుదల చేసిన జనాభా లెక్కల ఆధారంగా రూపొందించిన నివేదిక ఈ వివరాలను వెల్లడిస్తోంది. ఇందులో భారతీయుల ఘనతకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ థనం ప్రచురించింది. మరి, ఇందులోని వివరాలు ఏంటన్నది చూద్దాం.
ఈ వివరాల ప్రకారం సంపాదనలోనూ, చదువుల్లోనూ.. అమెరికన్లు, అక్కడ నివసిస్తున్న ఇతర దేశాల వారికన్నా భారతీయులు అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. అమెరికాలోని కుటుంబ జాతీయ సగటు ఆదాయం 63,922 డాలర్లు. అయితే.. భారతీయ కుటుంబాల సగటు ఆదాయం చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. అక్కడి భారతీయ కుటుంబాల సగటు ఆదాయం 1,23,700 డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇది జాతీయ సగటు ఆదాయం కన్నా.. దాదాపు రెట్టింపు.
కేవలం అమెరికాలోని పౌరులను వెనక్కి నెట్టడమే కాదు.. ఆసియాలోని ఇతర దేశాలకు చెందిన వారికన్నా భారతీయులు ముందు నిలిచారు. 1,23,700 డాలర్ల సగటు కుటుంబ ఆదాయంతో ఇండియన్స్ మొదటి స్థానంలో నిలవగా.. 97,129 డాలర్లతో తైవాన్ వాసులు, 95 వేల డాలర్లతో ఫిలిప్పీన్స్ దేశీయులు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక, 40 వేల డాలర్లకన్నా తక్కువ ఆదాయం పొందుతున్న కుటుంబాలు అమెరికాలో 33 శాతం ఉండగా.. వీరిలో భారతీయ కుటుంబాల శాతం కేవలం 14 మాత్రమే.
ఆదాయం పరిస్థితి ఇలా ఉంటే.. చదువులోనూ ఇండియన్లు దూసుకెళ్తున్నారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారి సగటు 34 శాతంగా ఉంది. భారతీయుల విషయానికి వచ్చే సరికి ఏకంగా 79 శాతం ఉండడం విశేషం. వైద్యం, కంప్యూటర్ సైన్స్ వంటి కీలక రంగాల్లో అధిక వేతనం వచ్చే ఉద్యోగాలను ఇండియన్లే దక్కించుకుంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది.
ఈ విధంగా.. అమెరికాలో భారతీయులు సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో భారతీయులు 40 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. వీరిలో 14 లక్షల మందికి గ్రీన్ కార్డు ఉంది. అంటే.. నివాస హోదా కలిగి ఉన్నారు. మరో 16 లక్షల మంది వీసా కలిగిన వారు. ఇంకో 10 లక్షల మంది అక్కడే పుట్టినవారు ఉన్నారు. భారతీయుల విస్తరణ వేగం.. భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.