Lok Sabha Speaker Election: మోడీ, రాహుల్‌.. లోక్సభలో అరుదైన దృశ్యం!

ఎన్నిక అనంతరం ప్రధాని నరేంద్రమోదీ, విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇద్దరూ కలిసి ఓం బిర్లాను కుర్చీలో కూర్చోబెట్టారు. స్పీకర్‌ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోయినా సభా సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాని, ప్రతిపక్ష నేత ఇద్దరూ కలిసి స్పీకర్‌ను కుర్చీలో కూర్చోబెట్టడం ఆకట్టుకుంది.

Written By: Raj Shekar, Updated On : June 26, 2024 1:20 pm

Lok Sabha Speaker Election

Follow us on

Lok Sabha Speaker Election: 18వ లోక్‌సభ స్పీకర్ గా ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఓబిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ మహతాబ్‌ ప్రకటించారు. మూజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావడం వరుసగా రెండోసారి. రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు. వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు.

మోదీ, రాహుల్‌ కలిసి..
ఎన్నిక అనంతరం ప్రధాని నరేంద్రమోదీ, విపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇద్దరూ కలిసి ఓం బిర్లాను కుర్చీలో కూర్చోబెట్టారు. స్పీకర్‌ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోయినా సభా సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాని, ప్రతిపక్ష నేత ఇద్దరూ కలిసి స్పీకర్‌ను కుర్చీలో కూర్చోబెట్టడం ఆకట్టుకుంది. ఇద్దరు నేతలూ స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొదట మోదీ శుభాకాంక్షలు తెలుపగా, తర్వాత రాహుల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, రాహుల్‌ పరస్పరం పలకరించుకున్నారు. పరస్పరం షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకున్నారు.

తప్పని ఎన్నిక..
లోక్‌సభ సంప్రదాయం ప్రకారం స్పీకర్‌ అధికార పక్ష నేత ఎన్నికైతే.. డిప్యూటీ స్పకర్‌ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలి. కానీ, ఎన్డీయే డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షానికి ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ను బరిలో నిలిపింది. దశాబ్దాల తర్వాత స్పీకర్‌ ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు.

డిప్యూటీ స్పీకర్‌ లేకుండా 17వ లోక్‌సభ..
ఓం బిర్లా 17వ లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్‌ లేకుండా ఐదేళ్లు పనిచేసి రికార్డులకెక్కారు. గత ప్రభుత్వంలో ఎన్డీ కూటమి డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయింది. ఈసారైనా ఎన్డీఏ కూటమి డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 18వ లోక్‌సభ కూడా డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే నిర్వహించేందుకే విపక్ష కూటమికి డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వలేదని తెలుస్తోంది.