America Indians: అమెరికాలో ఇటీవలి కాలంలో భారతీయులపై జరుగుతున్న దాడులు, అభిప్రాయ భేదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హత్యలు, బహిష్కరణ, యాక్సిడెంట్లతో భారత్‌లోని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో డాలస్‌లో ఎన్నారై సంఘాల ప్రతినిధులు సమావేశమై, ప్రవాస సమాజం ఆచరణలో పాటించాల్సిన నిబంధనలపై స్పష్టమైన సూచనలు చేశారు. ఈ సమావేశంలో తానా మాజీ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర సహా అనేకమంది ప్రవాస నేతలు పాల్గొన్నారు.
స్వేచ్ఛా భావాన్ని గౌరవించాలి..
అమెరికా అనేది విభిన్న సంస్కృతులు, మతాలు, భాషలు, ఆచారాలను అంగీకరించే ప్రజాస్వామ్య దేశం. అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని ఎన్నారైలు హెచ్చరించారు. సభల్లో భారతదేశ త్రివర్ణ పతాకంతో పాటు అమెరికా జెండా కూడా సమాన గౌరవంతో ప్రదర్శించాలి. వేదికలపై ఎడమవైపు అమెరికా, కుడివైపు భారత పతాకం ఉంచడం సముచితం. మొదట భారత జాతీయ గీతం, తరువాత అమెరికా జాతీయ గీతం ఆలపించాలి. గీతాల సందర్భంగా నిలబడి పతాకం వైపు గౌరవంగా చూడడం, టోపీలు తొలగించడం ఆచరించాలి. ఈ సూచనలతో ఎన్నారై సంఘాలు దేశభక్తి, గౌరవం, స్థానిక చట్టాల పట్ల అవగాహన పెంపొందించాలని విజ్ఞప్తి చేశాయి.
బాధ్యతగా ఉత్సవాలు, వేడుకలు..
భారతీయుల ఉత్సాహం అమెరికా నగరాల్లో అనవసర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీధుల్లో లౌడ్‌స్పీకర్ల మోత, బాణసంచా కాల్పులు, రహదారి మూసివేతలు ఇతర సమాజాల అసంతృప్తికి దారితీయవచ్చని హెచ్చరించారు. అటువంటి వేడుకలకు ముందుగా పోలీస్, సిటీ పర్మిషన్ తప్పనిసరి. వీలైనపుడు ఉత్సవాలను ఆలయ ప్రాంగణాల్లో లేదా ఖాళీ స్థలాల్లో నిర్వహించడం మంచిదన్నారు. ఇలా చేయకపోతే, స్థానిక ప్రజల ఫిర్యాదుల కారణంగా కమ్యూనిటీపై చెడు ముద్ర పడే అవకాశం ఉందని వక్తలు గుర్తుచేశారు.
మర్యాద తప్పనిసరి..
సినిమా విడుదలలు, రాజకీయ నేతల పర్యటనలు అమెరికాలో ఇండియన్ కమ్యూనిటీని ప్రతిబింబించే క్షణాలు కావాలి కానీ, అవే ప్రతికూలచిత్రాన్ని తెస్తున్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. థియేటర్లలో హీరోలపై అభిమానం వ్యక్తం చేయడం సరికాదు కానీ, పాలాభిషేకాలు, పేపర్లు చల్లడం, శబ్దకారక సంబరాలు అసహనం కలిగిస్తున్నాయి. అదే విధంగా రాజకీయ నేతలు అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు వీధి ర్యాలీలు, నినాదాలు, జెండాలు ఇతరులకు ఇబ్బద్ది కలిగిస్తున్నాయి.
ఇలాంటి చర్యలు పోలీసులు జోక్యం చేసుకునే పరిస్థితులను సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేశారు.
స్థానిక సమాజంలో కలిసిమెలిసి జీవించాలి
ప్రవాసులు స్థానిక సమాజంతో కలిసిమెలిసి జీవించడం అత్యంత అవసరమని ఎన్నారై నేతలు సూచించారు. ఇరుగుపొరుగు అమెరికన్లతో పరిచయం పెంచి పరస్పర నమ్మకం పెంపొందించాలి. స్థానిక రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం అవ్వాలి. అమెరికా పౌరసత్వం కలిగినవారు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
పేర్ల మార్పు, సామాజిక ప్రవర్తనల విజయంలో..
కొన్ని నగరాల పేర్లను భారతీయ విధానంలో మార్చి పలకడం సరైనదికాదని ఎన్నారై నేతలు హెచ్చరించారు. ‘‘డాలస్‌ని ‘డాలస్‌పురం’, క్యారల్టన్‌ని ‘కేరళాటౌన్’, గంటర్‌ని ‘గుంటూరు’గా పిలవడం అమెరికన్ల దృష్టిలో అపహాస్యంగా మారుతుంది,’’ అని చెప్పారు. స్థానికతను గౌరవించడం అంతర్జాతీయ మానవతా విలువ అని గుర్తు చేశారు.
వ్యక్తిగత బాధ్యత ..
దొంగతనం, నిందారోపణలు, మద్యం ప్రభావంలో డ్రైవింగ్ వంటి చర్యలు మొత్తం సమాజ గౌరవాన్ని దిగజారుస్తాయి. సామూహిక ప్రవర్తనలో చిన్న తప్పిదమే పెద్ద దుష్ప్రభావం కలిగిస్తుందని వారన్నారు.
సోషల్ మీడియా జాగ్రత్తలు
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాల్లో పోస్ట్ చేసే సందేశాలు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయని గుర్తు చేశారు. ప్రత్యేకించి అమెరికా రాజకీయ నేతలపై విమర్శాత్మక వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్త పాటించాలని సూచించారు.
ప్రవాస భారతీయులు అమెరికా సమాజంలో దీర్ఘకాలం గౌరవంగా నిలవాలంటే సాంస్కృతిక మర్యాద, సామాజిక సమన్వయం, చట్టపర స్పృహ అనేవే అసలైన విలువలని ఈ సదస్సు స్పష్టం చేసింది.