Inhumane Incident In Palnadu: మాయమైపోతున్నడన్న మనిషన్నవాడు.. అన్న ఓ సినీ కవి రాసిన ప్రతి అక్షరం సజీవ సాక్ష్యమే. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తిపాస్తులతో పాటు మాట పట్టింపులకే అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. సమాజంలో ఏదో ఒకచోట ఇటువంటివి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రి మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే మూడు రోజులుగా ఉంచి నరకాన్ని చూపించారు కొడుకులు. పున్నమా నరకం నుంచి కొడుకులు తప్పిస్తారనేది తరతరాల నుంచి ప్రజలు విశ్వసిస్తున్న ఓ నమ్మకం. ఆ తండ్రి కూడా అలానే భావించాడు. కుమారులు ఎదుగుతుంటే వారిని చూసి మురిసిపోయాడు. కానీ మరణానంతరం తనకు తలపురివి పెట్టేందుకు కూడా ముందుకు రారనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం పాత సొలస గ్రామంలో వెలుగు చూసింది ఈ ఘటన. సభ్య సమాజంలో తలదించుకునేలా చేసింది.
* కష్టపడి వృద్ధిలోకి తెచ్చి..
గ్రామానికి చెందిన గువ్వల పెద్ద ఆంజనేయులు( Pedda Anjaneyulu) ఓ సాధారణ రైతు కూలీ. కష్టపడి కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చాడు. 20 ఎకరాల పొలం సమకూర్చాడు. పదేళ్ల కిందట భార్య చనిపోయింది. నాగేశ్వరరావు, శ్రీనివాసరావు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లీశ్వరి, అనసూయమ్మలు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు నాగేశ్వరరావు కులాంతర వివాహం చేసుకొని తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డాడు. ఉన్న ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించాడు ఆంజనేయులు. చిన్న కుమారుడు శ్రీనివాసరావు వివాహం చేసుకొని స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఆయన వద్దే పెద్ద ఆంజనేయులు ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఆయన మృతి చెందాడు. అయితే కులాంతర వివాహం చేసుకొని బయట ఉన్న పెద్ద కుమారుడు నాగేశ్వరరావు గ్రామానికి వచ్చాడు. ఆస్తిలో తనకు వాటా ఇచ్చిన తర్వాతే అంత్యక్రియలు జరుగుతాయని తెగేసి చెప్పాడు. గతంలోనే రెండు ఎకరాలు ఇచ్చామని.. తన తండ్రి బాధ్యతలు తాను చూసినప్పుడు మిగతా భూమిలో వాటా ఇచ్చే ప్రసక్తి లేదని చిన్న కుమారుడు శ్రీనివాసరావు తేల్చి చెప్పాడు. అప్పటినుంచి వివాదం ప్రారంభం అయింది.
* పోలీసుల హెచ్చరికతో..
దాదాపు మూడు రోజులపాటు పాడె మీద మృతదేహం అలానే ఉండిపోయింది. గ్రామ పెద్దలు సర్ది చెబుతున్న పరిష్కారం కాలేదు. దీంతో సమస్య పోలీసుల దృష్టికి వచ్చింది. గ్రామానికి వెళ్ళిన పోలీసులు అంత్యక్రియలు నిర్వహించకపోతే పంచాయితీకి అప్పగించి అంతిమ సంస్కారాలు చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో బంధువుల సహకారంతో అంత్యక్రియలు జరిపించారు. కుమారులు బాగా బతకాలని పైసా పైసా పోగుచేశాడు ఆంజనేయులు. కానీ జీవిత చివరాంకంలో కుమారుల ఆదరణకు నోచుకోలేకపోయాడు. కుటుంబం సైతం వీధిన పడింది. అయితే ఇది ఒక ఆంజనేయుల పరిస్థితి కాదు. కానీ తండ్రి మృతదేహం పాడె మీద ఉండగా.. కుమారులు ఇద్దరు అలా వ్యవహరించడం మాత్రం విషాదాన్ని నింపింది. ప్రతి తల్లిదండ్రులకు ఇది ఒక గుణపాఠమే.