TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ద్వైవార్షిక మహాసభల సందర్భంగా ఛార్లెట్‌లో నిర్వహించిన ధీమ్ తానా పోటీలు విజయవంతంగా జరిగాయి. జూలై 3, 4, 5 తేదీల్లో జరగనున్న తానా మహాసభలకు ముందస్తు భాగంగా నిర్వహించిన ఈ పోటీలు తెలుగు సంస్కృతి, ప్రతిభలను వెలుగులోకి తెచ్చాయి.

తానా ద్వైవార్షిక సభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులు జరుగనున్నాయి. ఈ పోటీల్లో భాగంగా ప్రతిభావంతులను గుర్తించేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఛార్లెట్‌లో 14 గంటలపాటు థీమ్ తానా పేరుతో పోటీలు నిర్వహించారు. మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా, చిలక గోరింక, సోలో సింగింగ్, గ్రూప్ డ్యాన్స్ విభాగాల్లో 255 మంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలు తానా మహాసభల ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. 60 మంది వాలంటీర్లు కార్యక్రమ విజయానికి అంకితభావంతో కృషి చేశారు. 1200 మందికి పైగా ప్రేక్షకులు ఈ సందడిని తిలకించారు.

ఫాదర్స్ డే వేడుకల వైభవం
పోటీలతోపాటు ఫాదర్స్ డే వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. మూడు తరాల ప్రతినిధులు తాత, తండ్రి, మనవడు వేదికపై మాట్లాడి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం కుటుంబ బంధాలను సమన్వయపరిచే వేదికగా నిలిచింది.

సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు..
కార్యక్రమంలో రాఫిల్స్, షాపింగ్, ఫేస్ పెయింటింగ్, హెన్నా, మెహందీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పాల్గొన్నవారికి రిటర్న్ గిఫ్ట్‌లు అందించారు. ఝాన్సీ అబ్బూరి యాంకర్‌గా, ఎంసీగా వ్యవహరించగా, మిస్ యూనివర్స్ ఇండియా యూఎస్‌ఏ 2024 అమెలియా మల్లారెడ్డి, క్లాసికల్ డ్యాన్సర్ సాయి మౌనిక సజ్జ, కృష్ణ ప్రసాద్ సోంపల్లి తదితరులు పాల్గొన్నారు.

తానా మహాసభలకు ఆహ్వానం
తానా నాయకులు మాట్లాడుతూ, డెట్రాయిట్‌లోని నోవిలో జరిగే 24వ తానా మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, సినిమా తారలు, సంగీత దర్శకులు, సాహితీవేత్తలు, వ్యాపారవేత్తలు పాల్గొననున్నారని, ఛార్లెట్, చుట్టుపక్కల తెలుగువారంతా కుటుంబసమేతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమం విజయవంతం..
కార్యక్రమ విజయానికి నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, రాజేష్ యార్లగడ్డ, రవి వడ్లమూడి, మాధురి ఏలూరి, నిత్య గింజుపల్లి, హరిణి వరదరాజన్, హేమ దాసరి, శ్రీదేవి సుంకర, పట్టాభి కంఠంనేని, రమణ అన్నే, రమేష్ మూకుళ్ల, ప్రశాంత్ బొక్క, జానకి గోల్వి తదితరులు కృషి చేశారు. ఈ కార్యక్రమం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించే వేదికగా నిలిచింది. తానా మహాసభలకు ఉత్సాహాన్ని అందించింది.



