TANA vote controversy : ‘మొగుడు కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకే’ తెగ ఏడ్చేసిందట’ వెనుకటికి ఓకావిడ.. ఇప్పుడు అమెరికా తెలుగు అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం పోరాడిన సభ్యుల తీరు కూడా అలాగే ఉంది. ఓటు హక్కు కోసం కోర్టుకు ఎక్కారు ముగ్గురు సభ్యులు. ఈ విషయంలో తానా బోర్డు కనుక ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటే సమయంతోపాటు రెండు లక్షల డాలర్లు ఆదా అయ్యేవి. విలువైన నాలుగు నెలలు వృథా అయిపోయి.. కోర్టు ఖర్చుల కింద రెండు లక్షల డాలర్లు తానా బోర్డుకు ఖర్చుకు అయిపోయాయి. పోనీ తానా బోర్డు వారికి ఓటు హక్కు దక్కకుండా గెలిచిందా అంటే అదీ లేదు. చివరకు ఆ ముగ్గురికి ఓటు హక్కు వచ్చింది. కోర్టులో వారిపై పోరాడిన తానా బోర్డు మాత్రం రెండు లక్షలు పోయి ఓటు హక్కు ఇచ్చి నిండా మునిగింది. ఓటు హక్కు కోసం ఆ ముగ్గురు కూడా చివర వరకూ పోరాడి టైం వేస్ట్ చేసుకున్నారు. ఇలా ఒక్క ఓటు హక్కు కేసుతో తానా సభ్యులు గెలిచి ఓడారు.
తానాలో కొత్తగా చేరిన మెంబర్లకు ఓటింగ్ హక్కు ఇచ్చేందుకు గతంలో బోర్డ్ నిరాకరించడంతో దీనిపై వివాదం చెలరేగింది. ఓ ముగ్గురు సభ్యులు తమకు ఓటు హక్కు ఎందుకు ఇవ్వరంటూ నాలుగైదు నెలల క్రితం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. దీనిపై మేరీలాండ్ కోర్టు చర్చించి వివాద పరిష్కారం కోసం ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేసింది.
తానా బోర్డ్ కూడా దీనిపై కోర్టులో తన వాదనలు వినిపించేందుకు దాదాపు రెండు లక్షల డాలర్లను ఖర్చుపెట్టింది. చివరకు తానా బోర్డ్ వివాదానికి ముగింపు పలుకుతూ కోర్టుకెక్కిన ముగ్గురికి సింపుల్ మెజారిటీతో ఓటింగ్ హక్కును ఇస్తున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు బోర్డ్ దీనిపై ఎటూ తేలకుండా నాన్చడం వల్ల తానాకు అనవసరంగా రెండు లక్షల డాలర్లు ఖర్చయిందని, ఆ ఓటింగ్ హక్కును ఆనాడే ఇచ్చేసి ఉంటే డబ్బులు మిగిలి ఉండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో గెలిచింది కోర్టుకెక్కిన ఆ ముగ్గురేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్లనే ఓటింగ్ హక్కు ఇవ్వనన్న బోర్డ్ కోర్టులో తీర్పు ఎలా ఉంటుందోనన్న అనుమానంతో వారికి ఓటు హక్కు ఇచ్చింది. అందువల్ల కోర్టుకు వెళ్ళిన ముగ్గురిదే విజయం అని అంటున్నారు. ఈ విషయంలో తానా బోర్డ్ అపజయం చెందినట్టేనని అభిప్రాయపడుతున్నారు.
ఇది ఇలా ఉండగా.. తానాలో 33 వేల మంది సభ్యుల ఓటు హక్కు క్లాస్ యాక్షన్ కేసు ఇంకా న్యాయ వ్యవస్త పరిధిలోనే ఉంది. ఇప్పటికైనా తానా బోర్డు కళ్ళు తెరుచుకుని ఈ 33 వేల మంది సభ్యులకి ఓటు హక్కు ఇవ్వటంతో పాటు తానా దాతల డబ్బులు ఆదా చేస్తుందని ఆశిద్దాం.
తానా కోసం అమెరికాలోని ఎందరో ఎన్నారైలు, ప్రవాసులు ఎన్నో లక్షల డాలర్లను విరాళంగా అందిస్తుంటారు. ఎన్నారైల కోసం.. ఇండియాలో ఉన్న వారి కోసం ప్రవాస తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఆ అమౌంట్ ని ఖర్చు చేస్తుంటారు. ఇలా ఇగోలకు పోయి ఓటు హక్కు ఇవ్వని వారి కోసం ఏకంగా 2 లక్షల డాలర్లు ఖర్చు చేసిన తానా బోర్డ్ తీరును మాత్రం ఎవ్వరూ హర్షించటం లేదు.