అమెరికాలో శ్వేత జాతీయుల ప్రాబల్యం తగ్గిపోతోంది. అగ్రరాజ్యంలో బహుళ జాతుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల యూఎస్ లో జనాభా లెక్కలు సేకరించారు. ఈ వివరాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేశారు. ఇందులో తెల్ల జనాల సంఖ్య తగ్గడం.. ఇతర జాతీయుల సంఖ్య పెరగడం స్పష్టంగా కనిపించింది. మరి, ఎవరి వాటా ఎంత ఉంది? అన్నది చూద్దాం.
అమెరికాలో జనాభా లెక్కల సేకరణకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అక్కడ 1790 నుంచే జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. అయితే.. అప్పటి నుంచీ దేశంలో ఎప్పుడు జనాభా లెక్కలు తీసినా.. అందులో శ్వేత జాతీయుల జనాభానే ఎక్కువగా ఉండేది. తొలిసారిగా ఇప్పుడు మాత్రం వారి సంఖ్య తగ్గింది. 2010లో దేశ జనాభాలో తెల్లవారి శాతం 63.7శాతం ఉండగా.. తాజా లెక్కల ప్రకారం 57.8 శాతానికి తగ్గిపోయింది. సంఖ్యా పరంగా చూస్తే.. 2010లో 19.06 కోట్ల జనాభా ఉండగా.. ఇప్పుడు 19.10 కోట్లుగా ఉంది. అంటే.. ఈ పదేళ్లలో కేవలం .04 కోట్లు మాత్రమే పెరిగింది.
అదే సమయంలో ఇతర జాతులకు చెందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆసియన్లు, స్పానిష్, మెక్సికో మూలాలు ఉన్న వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. దేశ జనాభాలో వీరి శాతం 18.7శాతంగా ఉంది. వీరు మొత్తం 6.12 కోట్ల మంది ఉన్నారు. గత పదేళ్లలో ఆసియన్ల సంఖ్య భారీగా పెరిగింది. వీరు 2.4 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం అమెరికలో మొత్తం జనాభా 33.14 కోట్లుగా ఉంది.
ప్రతిభ కలిగిన వారి అవకాశాలకు అమెరికాను స్వర్గధామంగా చెబుతుంటారు. అందుకే.. ప్రపంచ దేశాల్లోని టాలెంటెడ్ పీపుల్ యూఎస్ విమానం ఎక్కేస్తుంటారు. ట్రంప్ హయాంలో ఈ పరిస్థితి కాస్త మారినప్పటికీ.. ముందు నుంచీ మెజారిటీ ప్రపంచ గమ్యస్థానం అమెరికానే అంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఏకంగా జనాభా లెక్కలే తిరుగులేని సాక్ష్యంగా నిలిచాయి.