YSRCP vs Media: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ చుట్టూ కుట్ర జరుగుతోందా? ఆ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నాయకత్వాన్ని మరింత బలహీనపరిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారా? అందులో భాగంగానే టిడిపి అనుకూల మీడియాలో కథనాలా? ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా టిడిపి అనుకూల మీడియా వైసిపి చుట్టూ అల్లుకుంటూ ప్రచురిస్తున్న కథనాలు ఆసక్తి రేపుతున్నాయి. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ నేతలు కేసుల్లో అరెస్ట్ అవుతున్న వేళ.. టిడిపి అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు మాత్రం ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే గతంలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని సాక్షి వండి వార్చిన కథనాలు ప్రజల్లోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మాత్రం టిడిపి అనుకూల మీడియా కథనాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. వైసీపీలో ఇప్పుడు అదే ఆందోళన.
Also Read: వైసీపీ కీలక నేత, జగన్ రైట్ హ్యాండ్ కు నోటీసులు
గోబెల్స్ ప్రచారం..
గోదావరి జిల్లాలకు( Godavari districts ) చెందిన వైసిపి మాజీమంత్రి ఒక్కరు పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఆయన మాత్రం అటువంటి ప్రయత్నాల్లో లేరు. కావలిస్తే ఆయనను డిఫెన్స్ లో పెట్టి పార్టీని వీడే వ్యూహంలో భాగమే ఆ కథనాలు అని వైసిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై నిత్యం విమర్శలు చేసేవారు అంబటి రాంబాబు. అటువంటి అంబటి రాంబాబు హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా ఓ ట్వీట్ చేశారు. తప్పకుండా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వైసీపీ లైన్ దాటిపోయారని.. జగన్మోహన్ రెడ్డిని లెక్కచేయడం లేదని ప్రచారం మొదలుపెట్టారు. అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో కథనాలు వండి వార్చుతున్నారు.
అధినేతను విభేదించారని..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో( YSR Congress party ) జగన్ నాయకత్వం నిర్వీర్యం అవుతోందని ప్రత్యేక కథనాలు టిడిపి అనుకూల మీడియాలో వస్తున్నాయి. ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారని.. మద్యం కుంభకోణంలో తనను అక్రమంగా అరెస్టు చేసే ప్రయత్నం జరుగుతోందని.. దానిని నిరసిస్తూ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని.. ఉప ఎన్నికలకు వెళితే బాగుంటుందని జగన్ చెబితే ఎమ్మెల్యేలంతా ముఖం చాటేసారని టిడిపి అనుకూల మీడియాలో ఒక కథనం వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు ఎవరైనా వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి అంత సాహసం చేస్తారా? అంటే నమ్మశక్యం కానిది. అధికార కూటమి బలంగా ఉంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ 11 స్థానాల్లో ఉప ఎన్నికలు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి చేజేతులా ఇబ్బందులు తెచ్చి పెట్టుకుంటారా? అనేది ఎక్కువ మంది ప్రశ్న. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అని ప్రజల్లోకి తీసుకెళ్లడమే టిడిపి అనుకూల మీడియా పని. దానిని ముందుగా గుర్తించాలి.
Also Read: జాతీయస్థాయిలో జగన్ ఎటువైపు?
అదే పనిగా టిడిపి అనుకూల మీడియా..
జగన్మోహన్ రెడ్డిని( Y S Jagan Mohan Reddy ) టార్గెట్ చేయాలని టిడిపి కూ టమి నేతలు అనుకుంటున్నారో లేదో కానీ.. అంతకుమించి మాత్రం పని చేస్తోంది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా. ఈ మీడియా ఇప్పుడు టిడిపి కూటమికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సాక్షి మీడియా గొడుగులా పని చేసింది. ఒకటి రెండు మీడియా సంస్థల సైతం వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచాయి. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలో చాలా రకాల కథనాలు వచ్చాయి. కానీ అవి ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు. కానీ ఇప్పుడు టిడిపి అనుకూల మీడియా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచురిస్తున్న కథనాలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళానికి కారణం అవుతున్నాయి. చూడాలి ఆ పార్టీ ఎలా అధిగమిస్తుందో..