HomeNewsYS JAGAN-YSRCP : జగన్ మారితేనే వైసీపీ నిలబడేది.. ఐదేళ్ల పాటు కష్టమే!

YS JAGAN-YSRCP : జగన్ మారితేనే వైసీపీ నిలబడేది.. ఐదేళ్ల పాటు కష్టమే!

YS JAGAN-YSRCP : వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత పది సంవత్సరాలు ఒక ఎత్తు.. ఈ ఐదు సంవత్సరాలు మరో ఎత్తు. 2014లో గౌరవప్రదమైన స్థానాలను సాధించింది వైసిపి. అధికార పార్టీకి ధీటుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వై నాట్ 175 అన్నారు. కానీ 11 స్థానాలకే పరిమితమయ్యారు. దీనినే దారుణ అవమానంగా భావిస్తున్నారు. అందుకే బయటకు వచ్చేందుకు కూడా జగన్ ఇష్టపడడం లేదు. ప్రజలకు ముఖం చూపించడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. పార్టీ శ్రేణులను సైతం భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఇలా అయితే ఐదు సంవత్సరాలు పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది.

జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నుంచి విజయం సాధించారు. ఆ ఇద్దరు మాత్రమే ఎంతో కొంత వీర విధేయులు. మిగతా వారంతా కొత్తవారే. వారు పార్టీలో ఉంటారా? ఉండరా? అన్నది సొంత పార్టీ వాళ్లే చెప్పలేకపోతున్నారు. కనీసం నలుగురు,ఐదుగురు పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే వారిని కాపాడుకునే ప్రయత్నాలను జగన్ చేస్తారా? చేయరా? ప్రశ్న ఎదురవుతోంది.వారి సంగతిని పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్తారా? వెళ్ళరా? అనేది మరో ప్రశ్న. ఇది జగన్ రాజకీయ భవితవ్యానికి పెను సవాల్ గా మారింది.

జగన్ అసెంబ్లీ కి వెళ్తే అవమానాలను ఎదుర్కోవాలి. అందుకు సిద్ధంగా ఉండాలి. ఆ విషయం ఆయనకు తెలియంది కాదు. తప్పకుండా టిడిపి నాయకులు, ప్రభుత్వం నుంచి అవమానాలు ఎదురవుతాయి. గతంలో చంద్రబాబును ఏ విధంగా అయితే గేలి చేశారో.. ఇప్పుడు టిడిపి నాయకులు అదేవిధంగా జగన్ ను గేలి చేస్తారు. వీడియోలు ప్రదర్శించి అనుచిత కామెంట్స్ చేస్తారు. గత ప్రభుత్వం ప్రకటించిన పథకాలను సైతం ఎండగడతారు. వీటన్నింటినీ భరించాల్సి ఉంటుంది. ఒకవేళ అసెంబ్లీకి దూరంగా ఉంటే గతంలో చంద్రబాబుపై జరిగే ప్రచారం ఇప్పుడు జగన్కు ఏర్పడుతుంది.కేవలం 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. అధికారంలోకి రాలేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి రావడం లేదన్న ప్రచారం తప్పకుండా జరుగుతుంది. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఇది ప్రజల్లోకి సైతం బలంగా వెళ్తుంది. అసెంబ్లీకి వెళ్లకుంటే రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తారు. టిడిపి తో పాటు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఎలాగూ ఉంది. జగన్ అసెంబ్లీకి వెళ్లకుంటే షర్మిల సైతం విరుచుకు పడడం ఖాయం.

వైసిపి ప్రతిపక్షంలోకి వచ్చినా షర్మిల వెనక్కి తగ్గడం లేదు. ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ అంటే వైయస్సార్ కు సంబంధం లేదని… వైసిపి అంటే యువజన రైతు శ్రామిక పార్టీ తప్ప వైయస్సార్ పార్టీ కాదని తేల్చి చెప్పారు. వైయస్సార్ కు వైసీపీకి సంబంధం లేదని కూడా కామెంట్ చేశారు. గత ఐదేళ్ల విధ్వంస పాలనను, రాజకీయ కక్షపూరిత పాలన అంటూ ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ప్రజల్లోకి విషయాలు తీసుకెళ్తారని కూడా హెచ్చరించారు. తద్వారా ఈ ఐదేళ్ల పాటు జగన్ కూడా తన టార్గెట్ అని చెప్పకనే చెప్పారు.

జనసేన గ్రాఫ్ పెరుగుతుండడం కూడా వైసీపీకి కలవరపాటుకు గురిచేస్తుంది. పవన్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. చాలా బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. జీతం తీసుకోకపోవడం, విలాసాలకు దూరంగా ఉండడం, నిత్యం సమీక్షలు చేస్తుండడం, సినిమాలను తగ్గిస్తానని చెప్పడం ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. పవన్ ఇమేజ్ ను పెంచుకుంటున్న నేపథ్యంలో జనసేన గ్రాఫ్ పెరగడం ఖాయం. ఆ ప్రభావం వైసిపి పై పడుతుందని కూడా టాక్ నడుస్తోంది.

జగన్ తప్పకుండా మారాల్సిన సమయం ఇది. వచ్చే ఐదేళ్లలో తాను మారినట్లు ప్రజలు గుర్తించేలా చేయాలి. విధ్వంస పాలన అన్న అపవాదును అధిగమించాల్సి ఉంటుంది. మీడియా ముందుకు రావాలి. నాయకులను కలుపుకెల్లాలి. కేడర్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న మాట నిజం చేయాలి. ప్రజల మధ్యకు రావాలి. ప్రజలతో మమేకమై పనిచేయాలి. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే. ఈ ఐదేళ్ల పాటు పోరాడితేనే ప్రజలు గుర్తిస్తారు. లేకుంటే మాత్రం పక్కన పెడతారు. ఇక ఆలోచించుకోవాల్సింది జగనే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version