Amaravathi capital : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. అమరావతి రాజధాని కి వైసీపీ జై కొట్టింది. గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధానిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం విధితమే. కానీ అనుకున్నది సాధించలేకపోయింది వైసీపీ.మూడు రాజధానులకు ముందడుగు వేయలేదు.అమరావతిరాజధాని నిర్మాణం చేపట్టలేదు.దీంతో ప్రజలు ఈ వైఫల్యాన్ని గుర్తించారు.ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. అందుకే వైసీపీకి తత్వం బోధపడినట్లు ఉంది. మూడు రాజధానులను ఎంపిక చేసి తాము తప్పు చేశామని ఒప్పుకోకపోయినా.. తాజాగా ఆ పార్టీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం.. అమరావతి రాజధాని కి జై కొట్టినట్లు అనిపిస్తోంది. ఇటీవల అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ప్రపంచ బ్యాంకు నిధులు కావడంతో.. రుణమేనని వైసీపీ చెబుతోంది. అయితే దీనికి రాష్ట్రం తో ఎటువంటి సంబంధం లేదని.. అప్పు ఇప్పించింది కేంద్రం కాబట్టి.. ఆ బాధ్యత కేంద్రానిదేనని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఈ విషయంపై వాదోపవాదనలు ఉండగా.. లోక్సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి.. అమరావతికి అప్పు రూపంలో వద్దని.. నేరుగా గ్రాంట్ రూపంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనతో అమరావతి రాజధాని నిర్మాణానికి వైసీపీ జై కొట్టినట్లు అయ్యింది. గత ఐదేళ్లుగా అమరావతి అన్న మాటను అనేందుకు కూడా వైసీపీ నేతలు ముందుకు రాలేదు. ఇప్పుడు అదే అమరావతికి నిధులు విడుదల చేయాలని కోరుతుండడం విశేషం.
* అందరి అభిప్రాయంతో నాడు
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. ఈ విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుంది. అప్పటి విపక్ష నేతగా జగన్ అమరావతి రాజధానిని స్వాగతించారు. సరైన నిర్ణయంగా అభివర్ణించారు. రాజధాని నిర్మాణానికి సమీకరిస్తామన్న 33 ఎకరాల భూమి చాలదని చెప్పుకొచ్చారు. మరింతగా సమీకరించాలని సలహా ఇచ్చారు. దీంతో చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. కొన్ని రకాల నిర్మాణాలను సైతం పూర్తి చేసింది.
* తెరపైకి మూడు రాజధానులు
రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. టిడిపి స్థానంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం మరుగున పడిపోయింది. కేవలం అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేసి.. పాలన రాజధానిగా విశాఖపట్నం ప్రకటించారు జగన్. కానీ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోయారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అప్పటి సీనియర్ మంత్రి బొత్స లాంటివారు అమరావతి రాజధానిని స్మశానంతో పోల్చారు. రైతుల నుంచి సేకరించిన భూమిని తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. కీలకమైన ఆర్ 5 జోన్ లో భూములను.. పేదల ఇళ్ల స్థలాల పేరిట పంచేశారు కూడా. అమరావతిని ఎంతగా దెబ్బతీయాలో అంతగా చేశారు.
* ఎట్టకేలకు కేంద్రం సాయం
అయితే మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీకి ప్రజలు తిరస్కరించారు. చివరకు పాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తామన్న విశాఖ జిల్లా ప్రజలు కూడా ఆహ్వానించలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు నుంచి దారుణంగా తిరస్కరణ ఎదురైంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త కళ వచ్చింది. నిర్మాణానికి కేంద్రం సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఇటువంటి తరుణంలో వైసిపి అడ్డుపడే ప్రయత్నం చేసింది. అమరావతి రాజధానికి అప్పుగా కాకుండా గ్రాండ్ రూపంలో నిధులు ఇవ్వాలని కోరింది. దీంతో అమరావతికి వైసిపి జై కొట్టినట్లు అయ్యింది. అసలు అమరావతి అంటేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎంపీలు ఆయనకు తెలియకుండా ప్రకటన చేశారా? లేదా? అన్నది తెలియాలి.