Prashant Kishor: వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా ప్రశాంత్ కిషోర్.. అక్టోబర్ 2 నుంచి సమరమే!

దేశంలో రాజకీయ వ్యూహకర్తలంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. గత దశాబ్ద కాలంగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ నేతగా అవతారం ఎత్తనున్నారు. రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : July 29, 2024 5:33 pm

Prashant Kishor

Follow us on

Prasanth kishore : పీకే…అలియాస్ ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. ఎన్నికల వ్యూహకర్తగా తెరపైకి వచ్చిన ఆయన ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలకు విజయాలను అందించారు. ఎన్నికల వ్యూహ కర్తగా విశేష సేవలు అందించారు. ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పరకాయ ప్రవేశం చేయనున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రెండేళ్ల కిందకి ఆయన జన్ సూరజ్ అనే సంస్థను ప్రారంభించారు. భవిష్యత్తులో దానిని రాజకీయ పార్టీగా మారుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబర్ 2న పార్టీని ప్రారంభిస్తున్నానని.. పార్టీ నాయకత్వంతో పాటు విధి విధానాలను త్వరలో వెల్లడిస్తానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు. ఐదేళ్లపాటు అక్కడే విధులు నిర్వహించారు. తరువాత ఎన్నికల వ్యూహకర్తగా మారారు. 2012లో తొలిసారిగా గుజరాత్ లో బిజెపి తరఫున వ్యూహ కర్తగా పనిచేశారు. నరేంద్ర మోడీ మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలకపాత్ర పోషించారు. అదే అనుభవంతో 2014లో మోడీ నేతృత్వంలోని బిజెపి గెలుపునకు దేశవ్యాప్తంగా బిజెపి తరఫున పనిచేశారు. ప్రధాని పీఠంపై మోదీని కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యారు. అప్పటినుంచి ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగింది. ఆయన సేవల కోసం రాజకీయ పార్టీలు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసే విజయాలను అందించారు. అదే సమయంలో కొన్ని అపజయాలను సైతం మూటగట్టుకున్నారు.

* వైసీపీకి వ్యూహ కర్తగా
2019 ఎన్నికలకు ముందు వైసీపీకి వ్యూహకర్తగా నియమితులయ్యారు ప్రశాంత్ కిషోర్. ఆ ఎన్నికల్లో జగన్ గెలుపునకు భారీగా వ్యూహాలు పన్నారు. అవి సక్సెస్ అయ్యాయి కూడా. ప్రజలను కుల, మతాలు, వర్గాలుగా విభజించి.. యూటర్న్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ అంది వేసిన చేయి. ఆ ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత.. ప్రశాంత్ కిషోర్ తో విభేదాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చేతులు కలిపారు. ఈ ఎన్నికల్లో జగన్ కు దారుణ పరాజయం తప్పదని హెచ్చరించారు. ఊహించని ఓటమి ఎదురవుతుందని కూడా తేల్చి చెప్పారు. అదే మాదిరిగా జగన్ కు ఘోర పరాజయం ఎదురు కావడంతో ప్రశాంత్ కిషోర్ జోష్యం ఫలించింది.

* దేశంలో చాలా పార్టీలకు సేవలు
అయితే ఒక్క జగన్ కే కాదు. ప్రశాంత్ కిషోర్ చాలా రాజకీయ పార్టీలకు సేవలు అందించారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయానికి కూడా కృషి చేశారు. అయితే ఏ పార్టీతో అయితే పని చేస్తారో.. అదే పార్టీ అధినేతతో విభేదాలు పెంచుకుంటారు ప్రశాంత్ కిషోర్. ప్రధాని మోదీతో పనిచేసిన ఆయన.. అదే మోదీని వ్యతిరేకించారు. కాంగ్రెస్ కు దగ్గర అవుతూనే.. అదే పార్టీ విధానాలను ఎండగట్టారు. అందుకే ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ శత్రువులు ఎక్కువ. గతంలో పీకే ను బందిపోటుతో పోల్చిన చంద్రబాబుకే రాజకీయ సలహాలు ఇచ్చారు.

* జేడీయు నుంచి బహిష్కరణ
బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయు పార్టీలో చేరారు ప్రశాంత్ కిషోర్. కానీ ఆ పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. 2018లో జేడీయులో చేరిన పీకే.. 2020లో బహిష్కరణకు గురయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో నితీష్ కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించడంతో.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే బీహార్లో కొత్త రాజకీయ పార్టీకి పావులు కదపడం ప్రారంభించారు. తొలుత జన సూరజ్ అనే సంస్థను స్థాపించారు. ఇప్పుడు అదే సంవత్సరం రాజకీయ పార్టీగా మార్చనున్నారు. ఆయన పార్టీతో ఎవరికి గండి పడుతుందో చూడాలి.