Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని ఒంటరి అయ్యారా? వైసీపీలో ఆయనను పట్టించుకునే వారు లేరా? ఆయనకు అండగా నిలవడం లేదు ఎందుకు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టించారంటూ ఆయన భార్యపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా మాజీ మంత్రిగా ఉన్న పేర్ని నానికి సైతం నోటీసులు ఇచ్చారు పోలీసులు. దీంతో కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో అండగా నిలవాల్సిన వైసిపి నేతలు ముఖం చాటేస్తున్నారు. దీంతో పేర్ని నాని హై కమాండ్ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు తెరపైకి వచ్చినప్పుడు నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత బయటకు రావడంతో వైసిపి నేతలు నానిని పరామర్శించారు. కానీ ఇటీవల వరుస పెట్టి విచారణలు, నోటీసులు అందుతుండడంతో నాని లో ఒక రకమైన భయాందోళన ప్రారంభమైంది. కనీసం ఆయనను ఇప్పుడు ధైర్యం చెప్పేవారు లేకపోవడంతో నిరాశ అలుముకున్నట్లు తెలుస్తోంది.
* నేరం అంగీకరించినట్లు అయ్యింది
మచిలీపట్నంలో పేర్ని నాని భార్య పేరిట గోదాములు ఉన్నాయి. వైసిపి హయాంలో ఆ గోదాముల్లో పౌరసరఫరాల శాఖకు సంబంధించి బియ్యం నిల్వలు ఉంచేవారు. అందులో ఉన్న 7556 బస్తాల బియ్యం మాయమైనట్లు విచారణ అధికారులు తేల్చారు. అయితే ఇలా మాయం అయిన బియ్యానికి సంబంధించి జరిమానా చెల్లించడంతో తప్పు ఒప్పుకున్నట్లు అయింది. అందుకే ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు ఎవరు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే కాకినాడలో పవన్ బియ్యం పట్టుకున్న సందర్భంలో పేర్ని నాని విమర్శించారు. సీజ్ ది షిప్ అంటూ పవన్ ఆదేశాలు అమలు కాకపోవటం పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే అక్కడికి రెండు రోజుల తర్వాతనే మచిలీపట్నంలో పేర్ని నాని గోదాముల్లో గోల్మాల్ బయటకు వచ్చింది. తమకు తాము ఫైన్ కట్టడంతో తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లు అయింది. ఇదే అదునుగా పేర్ని నాని చేసిన అక్రమాలను బయటకు తీస్తామంటూ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ప్రధానంగా ఆయన ప్రత్యర్థి, మంత్రి కొల్లు రవీంద్ర ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు.
* పట్టించుకోని జగన్
అయితే ఈ రేషన్ బియ్యం పక్కదారి విషయంలో తప్పు జరిగినట్లు వైసిపి భావిస్తోంది. అందుకే పేర్ని నానికి మద్దతు ఇవ్వడం లేదని ప్రచారం నడుస్తోంది. ఈ విషయంలో అధినేత జగన్ సైతం పట్టించుకోవడంలేదని నాని అనుచరులు బాధపడుతున్నారు. తమన్న ఒంటరి అయ్యారని.. ప్రభుత్వంతో ఒంటరి పోరాటం చేస్తున్నారని వాపోతున్నారు. పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతోనే ఆయన.. సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేలా తన భార్య విషయంలో మాట్లాడాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. తన భార్య జయసుధను జైల్లో పెట్టించడానికి టిడిపి నేతలు ప్రయత్నించారని.. కానీ చంద్రబాబు హుందాతో వద్దన్నారని పేర్ని నాని అన్న సంగతి తెలిసిందే. అయితే అది వైసిపి అధినేత నుంచి సరైన ప్రోత్సాహం లేక.. ఏం చేయాలో తెలియక అలా వ్యాఖ్యానించినట్లు ప్రచారమైతే నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.