Free Bus Travel: ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు అమలు సాధ్యం కాని హామీలు ఇస్తూ.. అందలం ఎక్కుతున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక.. హామీల అమలుకు తంటాలు పడుతున్నాయి. సరిగా ఏడాది క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీల హామీలో ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చింది. ఐదు గ్యారంటీల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఒకటి. ఏడాదిగా ఈ స్కీమ్ అమలవుతోంది. తీరా ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఇప్పుడు చార్జీలు పెంచాలని ప్రతిపాదన చేసింది. కనీసం 20 శాతం చార్జీల పెంపునకు కసరత్తు చేస్తోంది. ఈ స్కీమ్ ఢిల్లీలో, తమిళనాడులో అమలవుతోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్సు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని అమలు చేయడం ప్రారంభించింది. అయితే ఉచిత ప్రయాణం కారణంగా.. మహిళలు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దాదాపు ఆర్టీసీ బస్సుల్లో 80 శాతం మహిళలే ప్రయాణిస్తున్నారు. ఇక వీరంతా సీట్ల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకోవడం ఇంత వరకు చూశాం. తర్వాత ఆర్టీసీ బస్సులో జెడలు వేసుకోవడం, ఉల్లిపాయలు పొట్టు తీయడం, గోరింటాకు పెట్టుకోవడం, చివరకు పళ్లు తోముకోవడం వంటి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇవన్నీ బస్సు లోపల జరిగినవే. ఇప్పుడు బస్సు బయట ఓ ఘటన జరిగింది. తాజాగా ఓ బస్సు.. మహిళను రెబల్‌గా మార్చింది. రోడ్డుపై బస్సుకోసం ఓ మహిళ వేచి చూస్తుంటే డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళ చేతిలో ఉన్న బీరు బాటిల్ తీసి విసిరింది. దీంతో బస్సు అంద్దం పగిలింది. దీంతో డ్రైవర్ బస్సు ఆపి మహిళ దగ్గరకు వస్తుండగా, సంచిలో ఉన్న పామును తీసి అతనిపై విసిరింది. దీంతో ఆందోళన చెందిన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
హైదరాబాద్‌లో ఘటన..
ఈ ఘటన మహానగరం హైదరాబాద్‌లో జరిగింది. నల్లకుంట విద్యానగర్ బస్టాప వద్ద చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపకపోవడంతో ఓ వృద్ధురాలు తీవ్ర ఆగ్రహంతో బస్సుపైకి మొదట బీరు బాటిల్ విసిరింది. తర్వాత ఆమెను పట్టకునేందుకు వచ్చిన డ్రైవర్‌పై పాముని విసిరింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సదరు వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసింది.
పోలీసులకు ఫిర్యాదు..
పాముతో దాడికి యత్నించడంతో భయపడిన డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వచ్చి స్థానికుల సహాయంతో వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి బ్యాగులో మరో రెండు పాములు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఉచితంతోనే ఇలా..
ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మహిళలు ఇలా అనుచితంగా ప్రవర్తించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రీ అని ఇష్టానుసారం ప్రవర్తించడంపై మహిళలే మండిపడుతున్నారు. ఉల్లిపాయలు తీయడం, జెడలు వేసుకోవడం, గోరింటాకు పెట్టుకోవడం, పళ్లు తోముకోవడం వంటి ఘటనలు మహిళలు కూడా అసహ్యించుకుంటున్నారు. ఎంతో మంది అత్యవసరం కోసం రోడ్డు రవాణా సంస్థను ఉపయోగించుకుంటారని, ఇలాంటి ఘటనలతో దుర్వినియోగం చేయడంతోపాటు మహిళల పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు. కొందరైతే ఉచితం తీసేయాలని కోరుతున్నారు. వృద్ధులకు మాత్రమే ఫ్రీ ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు.