YCP Politics : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పార్లమెంటు ఎన్నికలతోపాటు మూడు నెలల క్రితం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైనాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని ప్రజలు కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. కూటమికి ఏకంగా 166 సీట్లతో తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. దీంతో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కనీసం నియోజకవర్గాల్లో కూడా కనిపించడం లేదు. సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. ఇక అధికార కూటమి నేతలు గతంలో తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. దీంతో వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు చూస్తే పార్టీకి గౌరవ ప్రదమైన సీట్లు లేవు.. ఇంకోవైపు అధికార కూటమి ఇరు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ తరఫునా మాట్లాడినా ఇబ్బందే అన్న భావనలోచాలా మంది సైలెంట్ అయ్యారు. ఇక అధికారం లేకుండా ఐదేళ్లు ఎలా ఉండాలన్న ఆలోచనతో చాలా మంది అధికార కూటమి పార్టీలవైపు చూస్తున్నారు. అయితే కూటమి నేతలు కూడా చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారు.
నాడు అరాచకం.. నేడు భయం..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారు. విపక్ష నేతలపై అక్రమంగా కేసులు పెట్టించారు. అరెస్టులు చేయించారు. మాట వినని వారిని అంతం చేశారు. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతలు కూడా అదే పంథాలో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డ టీడీపీ నేతలు తమను వేధించిన వారిపై కక్ష తీర్చుకుంటున్నారు. నాడు అధికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరించిన, మాట్లాడిన నేతలు ఇప్పుడు వైసీపీలో ఉండడానికి కూడా భయపడుతున్నారు. దీంతో రాజకీయాల నుంచే తప్పుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు టీడీపీని వీడి వైపీపీలో చేరిన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని.. మొన్నటి ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేశారు. సొంత సోదరుడి చేతిలో ఓడిపోయాడు. దీంతో ఇప్పుడు రాజకీయాల నుంచే తప్పుకున్నారు.
తాజాగా ఆళ్ల నాని..
ఇప్పుడు వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆళ్ల నాని , ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ కూడా కేశినేని నాని బాటలో నడిచారు. ఏలూరు జిల్లా వైసీపి అధ్యక్ష పదవికి, నియోజకవర్గం ఇన్‌చార్జి పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల చేతనే వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మాజీ మంత్రి మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్లు చెప్పగా, ఇటీవలే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయ ప్రత్యర్ధులను వెంటాడి వేటాడాలనే జగన్ ఎంచుకున్న విధానం వలననే నేడు వైసీపి నేతలకు ఈ దుస్థితి కలిగిందని చెప్పక తప్పదు. ఇది వీళ్లకే పరిమితమయ్యే పరిస్థితి లేదు.. ఇప్పటికే కొడాలి నాటి, రోజాతోపాటు చాలా మంది మాజీ మంత్రులు సైలెంట్ అయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో చాలా మంది రాజకీయాల నుంచి తప్పుకోవడం ఖాయం. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. అధికార కూటమిలోకి వెళ్లే అవకాశం ఉండేది. కానీ, ఎమ్మెల్యే పదవి కూడా లేకపోవడంతో అటు కూటమి పార్టీలు కూడా వీరిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇటు ఐదేళ్లు అధికార పార్టీ వేధింపులు ఎదుర్కొంటూ ఉండలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది రాజకీయాలకు స్వస్తి చెబుతారని నిపుణులు పేర్కొంటున్నారు.