Barkha madan : ఒక మనిషి మానసిక ప్రశాంతతను కలిగించేవి ఏమిటి? డబ్బు సౌకర్యాలను అందిస్తుంది. హోదా సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.. మరి మానసిక ప్రశాంతత? డబ్బు ఇస్తుందా? హోదా కల్పిస్తుందా? సమాజంలో గౌరవం తెచ్చిపెడుతుందా? అంటే ఈ ప్రశ్నలకు ఆ నటి వద్ద సమాధానాలు లేవు. జీవితంలో అన్నీ చూసిన తర్వాత.. ఏదో ఒక వెలితి. ఏదో ఒక అసంతృప్తి. వీటన్నింటికీ ఆమెకు లభించిన ఒకే ఒక్క సమాధానం బౌద్ధం. ప్రపంచ మానవాళికి శాంతిని, సౌబ్రాతృత్వాన్ని, కరుణను ప్రసాదించిన గౌతమ బుద్ధుడు ఆ ఆ నటికి కూడా ప్రసాదించాడు. సూక్ష్మంలో మోక్షం వెతుక్కున్నట్టు బౌద్ధమతంలో ఆ అందాల నటి శాంతిని, మానసిక ప్రశాంతతను పొందింది..సీన్ కట్ చేస్తే బౌద్ధ సన్యాసి అయింది. గౌతమ బుద్ధుడు అన్నింటిని త్యజించినట్టు.. ఆ నటి కూడా అన్నిటిని వదిలేసుకుని ఎక్కడో దూరంగా బతుకుతోంది. స్వచ్ఛమైన హిమాలయాలు, చెంతనే నదీ జలాలు.. ఆహ్లాదకరమైన ప్రకృతిలో సాత్వికమైన ఆహారం తీసుకుంటూ.. ప్రశాంతంగా బతుకుతున్నది. ఇంతకీ ఎవరు ఆ నటి? ఏమిటి ఆమె నేపథ్యం? ఈ కథనం లో తెలుసుకుందాం రండి.
ఆమె పేరు బర్ఖా మదన్. చదువులో చురుకు. పైగా అందంగా ఉంటుంది. తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో మోడల్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 1994 లో సుస్మితా సేన్, ఐశ్వర్యరాయ్ తో మిస్ ఇండియా పోటీల్లో పోటీ పడింది. త్రుటిలో చేజార్చుకుంది. ఆ తర్వాత మిస్ టూరిజం ఇండియా గా ఎంపికైంది.. మలేషియాలో జరిగిన మిస్ టూరిజం ఇంటర్నేషనల్ పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఆమె అందానికి బాలీవుడ్ ఫిదా అయింది. అవకాశాలు ఇచ్చింది. ఎలాగూ మోడల్ రంగంలో ఉండటంతో ఆమె కూడా దానికి నో అని చెప్పలేదు.. 1996 లోన్ అక్షయ్ కుమార్, రేఖ, రవీనా టాండన్ తో కలిసి ఖిలాడియోన్ కా ఖిలాడి లో నటించింది. ఆ సినిమాతో బాలీవుడ్ లోకి ఆరంగేట్రం చేసింది.ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విజయంతో ఆమెకి చాలా ఆఫర్లు వచ్చాయి. అలా ఆమె చాలా బిజీ నటి అయింది. ఆ తర్వాత 2003 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన భూత్ అనే సినిమాలో నటించింది. అందులో దయ్యం పాత్రను పోషించింది. సినిమాలు మాత్రమే కాకుండా “1857 క్రాంతి ” అనే సామాజిక ఇతి వృత్తం ఉన్న సీరియల్ లో నటించింది. ఇందులో ఆమె లక్ష్మీబాయి పాత్ర పోషించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 2005 నుంచి 2009 వరకు జీ టీవీ లో సాత్ ఫేరే_ సలోని కా సఫర్ అనే షో లో కనిపించింది. 2010 లో నిర్మాతగా మారింది. గోల్డెన్ గేట్ ఎల్ఐసి అనే సంస్థను ప్రారంభించింది. సోచ్ లో, సుర్ఖాబ్ అనే చిత్రాలు నిర్మించింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా బౌద్ధ మతంలోకి మారిపోయింది. 2012 లో బౌద్ధ మతాన్ని స్వీకరించి సన్యాసిగా మారింది.
బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత బర్ఖా మదన్ తన పేరును గ్యాల్టెన్ సామ్ టెన్ గా మార్చుకుంది. దలైలామా బోధనలు ఇష్టపడి ఆమె బౌద్ధ సన్యాసిగా మారిపోయింది. ఎక్కడో హిమాలయాలలో ఆశ్రమంలో ఉంటున్నది. తన ఆశ్రమానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నది. బౌద్ధ సన్యాసిరాలిగా మారిపోయిన తర్వాత జీవితం చాలా ప్రశాంతంగా ఉంటున్నదని బర్ఖా మదన్ చెబుతోంది. మానసిక ప్రశాంతత లభిస్తున్నదని,ఇప్పుడు వేటి మీద తనకు కోరికలు లేవని అంటున్నది. బాలీవుడ్ లో బర్ఖా మదన్ మాత్రమే కాకుండా జైరా వాసిమ్, సనా ఖాన్ కూడా ఇలానే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు.