https://oktelugu.com/

Posani Krishna Murali : పోసానిపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్.. గట్టిగానే బిగించేస్తున్న ఏపీ పోలీసులు.. ఆ కేసు ఇదీ

పోసాని కృష్ణ మురళి చుట్టూ ఏపీ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు పోలీసులకు. తాజాగా టిడిపి నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీస్ అందించడంతో పాటు అరెస్టు చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది.

Written By: Dharma, Updated On : November 18, 2024 7:05 pm
Posani Krishna Murali

Posani Krishna Murali

Follow us on

Posani Krishna Murali :  ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉంది. ఒకవైపు పాలనపై దృష్టి పెడుతూనే.. మరోవైపు వైసీపీని వెంటాడుతోంది.గతంలో తప్పిదాలను బయటకు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భూ ఆక్రమణలపై దృష్టి పెట్టింది.అన్ని జిల్లాలపై ఫోకస్ పెడుతోంది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల పై కేసులు నమోదవుతున్నాయి. వైసీపీకి మద్దతుగా నిలిచిన సినీ సెలబ్రిటీలపై సైతం కేసులు నమోదవుతుండడం విశేషం. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు అందించారు. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా.. రాంగోపాల్ వర్మ చంద్రబాబు కుటుంబం పై అనుచిత పోస్టింగులు పెట్టారంటూ తెలుగుదేశం నేత ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే తనను అరెస్టు చేస్తారని భావించిన రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయకుండా నియంత్రించాలని కోరారు. అయితే ఆయన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీంతో ఏ క్షణమైనా రాంగోపాల్ వర్మ అరెస్టు అవుతారని ప్రచారం సాగింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పోసాని కృష్ణ మురళి పేరు బయటకు వచ్చింది. ఆయనపై తాజాగా పోలీస్ కేసు నమోదయింది. ఓ టిడిపి నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణ మురళిని సైతం ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని టాక్ నడుస్తోంది.

* వైసిపి హయాంలో దూకుడు
సాధారణంగా పోసాని కృష్ణ మురళి దూకుడుగానే మాట్లాడుతారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ పై విరుచుకుపడేవారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు కూడా. అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఈ ఇద్దరు జగన్ పై విమర్శలు చేస్తే.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉండే పోసాని ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యేవారు. వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసేవారు. ఒకానొక దశలో పవన్ కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసైనికులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. హైదరాబాదులో పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పోసాని. ఇటీవల అడపాదడపా బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై తెలుగు యువత అధికార ప్రతినిధి వంశీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* సీఎంను కించపరిచారని
రెండు నెలల కిందట మీడియా ముందుకు వచ్చారు వంశీకృష్ణ. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అయితే సీఎం చంద్రబాబుపై వ్యక్తిగతంగా మాట్లాడారని.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ పోసాని పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వంశీకృష్ణ. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోసాని కృష్ణ మురళికి నోటీసులు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో అరెస్టు చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.